తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ – వర్కర్స్ ఫెడరేషన్ వారు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు గారి జన్మదిన వేడుకలు ఒకరోజు ముందుగానే అంటే ఫిబ్రవరి 16న ఘనంగా నిర్వహించారు.
యూసఫ్ గూడ లోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను టెలివిజన్ ఫెడరేషన్ లోని అన్ని విభాగాల వారు కలిసి సమన్వయంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాలు సాయంత్రం మూడున్నర గంటల వరకు కోలాహలంగా జరిగాయి. పాటలు, నృత్యాలు మిమిక్రీ, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వాటి ద్వారా.. టీవీ ఫెడరేషన్ సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీవీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగబాల సురేష్ గారు, ప్రస్తుత ఫెడరేషన్ అధ్యక్షులు కే.రాకేష్, జనరల్ సెక్రటరీ పి.విజయ్ కుమార్, ట్రెజరర్ కే.నరేందర్ రెడ్డి, గ్రాఫిక్స్ యూనియన్ అధ్యక్షులు మోహన్ రాజు, మ్యూజిక్ యూనియన్ అధ్యక్షులు ఖుద్దూస్, డాన్సర్ యూనియన్ అధ్యక్షులు ఈ.రమేష్.. ఇలా అన్ని యూనియన్ తాలూకా అధ్యక్షులు, కార్యదర్శులు, ట్రెజరర్సు,ఇతర కార్యవర్గ సభ్యులు, సాధారణ సభ్యులందరూ కలిసి సమన్వయంతో చక్కగా నిర్వహించారు. దాదాపు 1500 మంది టీవీ ఫెడరేషన్ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి అతిథులుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ.. “తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ – వర్కర్స్ ఫెడరేషన్ వారు మన సీఎం కేసీఆర్ గారి బర్త్ డే ను ఇంత గ్రాండ్ గా నిర్వహించడం అభినందనీయం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను గుర్తు చేస్తూ రాసిన పాట చాలా బాగుంది. రచయిత వెనిగళ్ళ రాంబాబు గారికి, సంగీత దర్శకులు ఖుద్దూస్ గారికి, గాయకుడు ధనుంజయ్ గారికి అభినందనలు. పాటలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలను చాలా బాగా హైలెట్ చేశారు. ఈరోజు టీవీ సీరియల్స్ చూడని ఇల్లాలు లేదు. ఈరోజు టెలివిజన్ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తెలుగు భాషలోనే అధిక సంఖ్యలో సీరియల్స్ నిర్మాణం జరుగుతున్నట్లు తెలుస్తోంది. టీవీ రంగంలో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. వారిలో అర్హులైన వారందరికీ ఆరోగ్య శ్రీ, కళ్యాణ లక్ష్మి పథకాలన్నీ ఏర్పాటు చేస్తాం. టీవీ ఫెడరేషన్ వారు ప్రభుత్వాన్ని టీవీ నగర్, టీవీ భవన్ కావాలని కోరుతున్నారు. అవి ఇచ్చే సందర్భం కూడా త్వరలోనే వస్తుంది. ప్రభుత్వం టీవీ రంగానికి సంపూర్ణంగా అండగా ఉంటుంది” అన్నారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. “తెలుగు టీవీ అండ్ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ వర్కర్స్ ఫెడరేషన్ వారు ఎంతో ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు నా నియోజకవర్గంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరగడం, నన్ను ఆహ్వానించడం, ముఖ్యమంత్రి గారి బర్త్ డే వేడుకల కేక్ ని నాతో కట్ చేయించడం ఎంతో సంతోషదాయకం. ఇక ఫెడరేషన్ వారు కార్మికుల కోసం, కళాకారుల కోసం టీవీ నగర్, టీవీ భవన్ కావాలని కోరుతూ ఉన్నారు. విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్తాను, టీవీ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. సీఎం కేసీఆర్ గారు కళాకారుల పట్ల, కార్మికుల పట్ల, పేదల పట్ల ఎంతో సానుకూలంగా ఉంటారు. అన్ని నెరవేరుతాయి. ఆ సమయం వస్తుంది” అన్నారు.
తెలంగాణ FDC చైర్మన్ అనిల్ కూర్మాచలం గారు కెసిఆర్ గారి జన్మదిన వేడుకల సభలో మాట్లాడుతూ.. “టీవీ రంగంలో సమర్థవంతమైన నాయకత్వం ఉందని నాకు అర్థమైంది పలు సందర్భాల్లో ఫెడరేషన్ నాయకులు కలిశారు. వారు ఎంతో పట్టుదల గలవారు. కార్య దక్షత కలిగిన వారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం దృష్టిలో పెట్టుకొని ఒక రోజు ముందే ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. నాగబాల సురేష్ గారు, కే.రాకేష్ గారు, విజయ్ కుమార్ గారు ఇతర సభ్యుల నాయకత్వంలో త్వరలోనే వారు అనుకున్నది సాధిస్తారు. వారు నన్ను కలిసినప్పుడు ఎన్ని సీరియల్స్ నిర్మాణం జరుగుతున్నాయి. ఎన్ని వేలమంది టీవీ రంగం ద్వారా ఉపాధి పొందుతున్నారు.. టీవీ రంగం నుంచి ఏటా కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి టాక్స్ రూపంలో అందుతుంది అన్న విషయాల్ని నాకు తెలియజేశారు. ఎఫ్ డి సి వైపు నుంచి టీవీ నగర్ కోసం ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తాం. ముఖ్యమంత్రి గారు కళాకారులు పట్ల, కార్మికుల పట్ల ఎంతో ప్రేమతో, ఆదరణతో ఉంటారు. పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ద్వారా, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు.. తదితర పెద్దల ద్వారా టీవీ నగర్ విషయం సీఎం గారి దృష్టికి చేరుతుంది. ఆ తర్వాత చిత్రపురి కాలనీ కంటే మిన్నగా టీవీ నగర్ రూపుదిద్దుకుంటుంది అన్న నమ్మకం నాకుంది” అన్నారు.
తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణుగోపాల చారి గారు మాట్లాడుతూ.. “టీవీ ఫెడరేషన్ వారు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఎనిమిది సంవత్సరాలుగా దేశమే ఆశ్చర్యపోయేలాగా సీఎం కేసీఆర్ గారు అద్భుతమైన అభివృద్ధి చేస్తున్నారు. తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ వారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డే ఘనంగా నిర్వహిస్తున్నారు. రక్తదాన, ఉచిత వైద్య పరీక్షల శిబిరాలు నిర్వహిస్తున్నారు. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. విజన్ VVK సంస్థ అధినేత విజయ్ కుమార్ గారు టెలివిజన్ రంగ కార్మికుల కోసం 100 ఫ్లాట్స్ ఉచితంగా పంపిణీ చేశారు. వారికి ప్రత్యేక అభినందనలు. ఫెడరేషన్ నాయకులు నాగబాల సురేష్, రాకేష్, విజయ్ కుమార్ మోహన్ రాజ్ ఖుద్దూస్, రమేష్ తదితరులంతా టీవీ రంగ కార్మికుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. వీరందరూ టీవీ నగర్, టీవీ భవన్ కావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఫెడరేషన్ వారు ముందుగా జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే స్థలాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు టీవీ నగర్ ఏర్పాటుకు నా వంతు సహకారం నేను అందిస్తాను. ముఖ్యమంత్రి గారి దృష్టికి టీవీ నగర్ విషయాన్ని తీసుకువెళ్తాను. నా వంతు సహకారం అందిస్తాను. దానికంటే ముందుగా రేషన్ కార్డులు లేని వారందరూ కూడా రేషన్ కార్డుల కోసం అప్లై చేసి రేషన్ కార్డులు తెప్పించుకోవాలి” అన్నారు.
మల్కాజ్గిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు ఈ జన్మదిన వేడుకల్లో మాట్లాడుతూ.. “తెలుగు సినిమా రంగం భారత సినిమా రంగానికి హబ్ గా మారుతోంది. సినిమా, టీవీ రంగాల్ని కేసీఆర్ గారు మరింతగా ప్రోత్సహించాలి అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెలివిజన్ ఫెడరేషన్ వారు చేస్తున్న విజ్ఞప్తులని కెసిఆర్ గారు సానుకూలంగా పరిశీలించి టీవీ నగర్, టివి భవన్ సాంక్షన్ చేస్తారని భావిస్తున్నాను” అన్నారు.
తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగబాల సురేష్ గారు మాట్లాడుతూ.. “టీవీ లేని ఇల్లు లేదు కానీ టీవీ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు, కళాకారులకు చాలా మందికి ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. వారికి ప్రభుత్వం సహకరించి టీవీ నగర్ ఏర్పాటు చేసి, ఇళ్లు కట్టించాలి అని విజ్ఞప్తి చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి గారు, సముద్రాల వేణుగోపాల చారి గారు టీవీ నగర్ విషయంలో ఎంతో సానుకూలంగా స్పందిస్తున్నారు. వారు టీవీ నగర్ గురించిన విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకు వెళ్తారు. మన టీవీ ఫెడరేషన్ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వ అధికారులను కలిసి మన టీవీ నగర్ విషయంగా చేయవలసిన టువంటి విజ్ఞప్తులను మనం చేస్తూ ఉండాలి. ప్రభుత్వ పెద్దల సహకారంతో, అధికారుల సహకారంతో, మన ఫెడరేషన్ సభ్యుల సహకారంతో త్వరలోనే మనం టీవీ నగర్ ని సాధించుకుందాం” అన్నారు.
శాసన మండలి సభ్యులు పురాణం సతీష్ గారు మాట్లాడుతూ.. “టీవీ రంగం వాళ్ళు కరోనాలో కూడా పనిచేసి వార్తలు అందించారు. కేసీఆర్ గారి బర్త్ డే వేడుకలకు టీవీ ఫెడరేషన్ వాళ్ళు ఆహ్వానించడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. కెసిఆర్ గారికి టీవీ రంగం గురించి బాగా తెలుసు. మీరు టీవీ నగర్, టీవీ భవన్ గురించి అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాను. ఆయన ‘ఎస్’ అన్నారు అంటే అది చట్టం చేసినట్లే. మీ టీవీ ఫెడరేషన్ వారి కోరికలు నెరవేరుతాయి అన్న నమ్మకం ఉంది” అన్నారు.
ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పై, ప్రభుత్వ పథకాలపై రూపొందించిన పాటల బిగ్ సీడీని సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆవిష్కరించారు.
తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ అధ్యక్షులు కే రాకేష్ మాట్లాడుతూ.. “టీవీ నగర్ ఏర్పాటుకి ప్రభుత్వం పూర్తిగా సానుకూలంగా ఉంది. ఖచ్చితంగా టీవీ నగర్ సాధించి తీరుతాం. టీవీ కార్మికుల, కళాకారుల కల త్వరలోనే నెరవేరుతుంది. ఐకమత్యంమే మన విజయానికి కారణం అవుతుంది” అన్నారు. “సారు.. కేసీయారు.. జన సంక్షేమమే మీ పేరు..”పాట రాసిన వెనిగళ్ళ రాంబాబు, సంగీతం సమకూర్చిన ఖుద్దూస్, కొరియోగ్రాఫర్స్ ఈ రమేష్ సత్య మాస్టర్ లను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ శాలువతో సత్కరించారు. కెసిఆర్ గారు జన్మదిన వేడుకలలో భాస్కర్ మెడికల్ కాలేజీ వారు రక్తదాన శిబిరాన్ని, ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. 110 మందికి పైగా రక్తదానం చేశారు. 150 మందికి పైగా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని టీవీ ఫెడరేషన్ కు చెందిన అన్ని అసోసియేషన్ ల వారు చక్కని సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.