సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ టాంక్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో FDC చైర్మన్ అనిల్ కూర్మాచలం తో కలిసి మాట్లాడారు. RRR చిత్రానికి ఆస్కార్ అవార్డ్ లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి FDC చైర్మన్, FDC ED కోశోర్ బాబు, జర్నలిస్టు లకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆస్కార్ అవార్డ్ ను అందుకున్న ఏకైక తెలుగు చలనచిత్రం గా RRR కు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీ లో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల తెలుగు రాష్ట్రాలు, దేశం గర్వపడుతుందని చెప్పారు. ఆస్కార్ అవార్డ్ ను అందుకున్న గొప్ప చిత్రం RRR ను నిర్మించిన డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్, గాయకులు రాహుల్ సిబ్లిగంజ్, కాలభైరవ, కొరియో గ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు.
త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తరుపున వారికి సన్మానం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కేంద్రంలోని BJP ప్రభుత్వానికి మొదటి నుండి కూడా దక్షణాది రాష్ట్రాలు అంటే చిన్నచూపు అని మంత్రి విమర్శించారు. ఆస్కార్ అవార్డుల కోసం ఎంట్రీ పంపండి అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రానికి చెందిన సినిమా చెలో షో ను ఆస్కార్ ఎంట్రీ కి పంపించారని ఆరోపించారు. కానీ వారికి గుణపాఠం చెప్పినట్లుగా RRR చిత్రం ఆస్కార్ కు ఎంపికైనదని అన్నారు. చిత్ర దర్శకులు రాజమౌళి కృషితోనే ఆస్కార్ అవార్డ్ దక్కిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలతో సినిమా రంగానికి తెలంగాణా కేరాఫ్ అడ్రస్ గా మారిందని చెప్పారు. చిత్ర పరిశ్రమ కు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటూ పరిశ్రమ అభివృద్దికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉంటుందని వివరించారు.