Sithara Entertainments: డివైన్ స్టార్ రిషబ్ శెట్టితో భారీ చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్

ప్రేక్షకులకు వైవిధ్యభరితమైన చిత్రాలను అందిస్తూ, వరుస ఘన విజయాలతో దూసుకుపోతోంది ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. ఇప్పుడు ఈ సంస్థ మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టింది.

‘కాంతార’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ అగ్ర కథానాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ భారీ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ‘కాంతార 2’ చిత్ర పనుల్లో నిమగ్నమై ఉన్న రిషబ్, ఒక ఫిక్షనల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా కోసం సితారతో చేతులు కలిపారు. 18వ శతాబ్దంలో భారత్‌లోని అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్‌లో ఒక తిరుగుబాటుదారుడు ఎదిగిన క్రమం నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుంది.

మంచి కథకుడిగా పేరు గాంచిన, ప్రతిభావంతులైన అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈసారి ఆయన ఓ అద్భుతమైన కథతో ప్రేక్షుకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నారు.

ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషలలో ఏక కాలంలో చిత్రీకరించబడుతుంది. తెలుగు, కన్నడతో పాటు తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

ప్రొడక్షన్ నెం.36 గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ నటీనటులు, ప్రతిభగల సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేయనున్నారు.

కేవలం ప్రకటనతోనే భారతీయ సినిమాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను త్వరలో నిర్మాతలు వెల్లడించనున్నారు.

తారాగణం: రిషబ్ శెట్టి

దర్శకత్వం: అశ్విన్ గంగరాజు
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్

జగన్ దెబ్బకు బాబు మౌనం || Analyst Ks Prasad About Ys Jagan Tweet On Chandrababu || Telugu Rajyam