తలచినదే జరిగినదా దైవం ఎందులకు.. జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు.. “మనసే మందిరం” సినిమా కోసం ఆచార్య ఆత్రేయ రచించిన గీతం ఇది. ఇప్పుడు ఆ సంగతి ఎందుకంటే… ప్రస్తుతం నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పరిస్థితికి ఈ పాటలోని మొదటి రెండు లైన్లూ కరెక్ట్ గా సరిపోతాయని అంటున్నారు. ఆ కథాకమీషేమిటో ఇప్పుడు చూద్దాం…!
2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘురామకృష్ణరాజు.. 31,909 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అనంతర కాలంలో అధినేతతో విభేదాలు రావడంతో… స్వపక్షంలో విపక్షం పాత్ర పోషించారు. ఇందులో భాగంగా అవకాశం ఉన్న ప్రతీసారీ జగన్ పైనా, ఏపీ సర్కార్ పైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒక్కమాటలో చెప్పాలంటే… వైసీపీపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు!
ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన నేతలు దగ్గరయ్యారు. ఒక వర్గం మీడియాకు రెగ్యులర్ అయ్యారు! దీంతో… రానున్న ఎన్నికల్లో ఆయన టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని కథనాలొచ్చాయి! పొత్తులో భాగంగా ఆ స్థానం టీడీపీకి వెళ్తే టీడీపీ నుంచి.. జనసేనకు వెళ్తే జనసేన నుంచి.. బీజేపీకి వెళ్తే బీజేపీ నుంచి ఆయన పోటీ కన్ ఫాం అని తెలిపారు!
అయితే… నరుడు ఒకటి తలిస్తే.. దైవం మరొకటి తలచిందన్నట్లుగా రఘురామ విషయంలో బీజేపీ పెద్దలు సానుకూల వైఖరి కనబరచడం లేదనే వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హల్ చల్ చేస్తుంది. పొత్తులో భాగంగా నరసాపురం లోక్ సభ స్థానం బీజేపీ ఖాతాలో పడుతుందని.. అయితే ఆ టిక్కెట్ రఘురామ కృష్ణంరాజుకు ఇవ్వడానికి బీజేపీ పెద్దలు అంగీకరించడం లేదని అంటున్నారు.
ఇదే సమయంలో ఆ స్థానంలో తమ టిక్కెట్ ను దివంగత కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవికి ఇవ్వాలని.. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. కేంద్ర నాయకత్వానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ అందుకు శ్యామలాదేవి సుముఖత వ్యక్తంచేయని పక్షంలో… భూపతిరాజు శ్రీనివాస వర్మను పోటీకి దించాలని బీజేపీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నర్సాపురం ఎంపీ టికెట్ రఘురామ కృష్ణంరాజుకు దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని.. అది ఆల్ మోస్ట్ అసాధ్యం అని అంటున్నారు. పోనీ రాజమండ్రి ఎంపీ టిక్కెట్ అయినా దక్కుతుందా అంటే.. అదీ లేదని తెలుస్తోంది. రాజమండ్రి లోక్ సభ స్థానానికి ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ కు బీజేపీ టిక్కెట్ ఇవ్వనుందని అంటున్నారు.
దీంతో.. రఘురామకృష్ణంరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ఈసారికి పోటీ నుంచి వైదొలగుతారా.. లేక, ఇండిపెండెంట్ గా ట్రైచేసే సాహసం ఏమైనా చేస్తారా అనేది వేచి చూడాలి!