మరో మహిళా ప్రాధాన్య పాత్రలో అనుష్క

మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్ గా నిలిచారు అనుష్కశెట్టి. ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’లో దేవసేన లాంటి పాత్రలతో మెప్పించిన ఆమె ఆ తరహాలోనే మరో పాత్ర చేయనున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకూ తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలకే పరిమితమైన అనుష్క తాజాగా ఓ అడుగు ముందుకేసి మలయాళ ఇండస్టీల్రో కూడా అడుగు పెడుతున్నారు.

‘కథనార్‌ ది వైల్డ్‌ సోర్సెరర్‌’ టైటిల్‌తో రానున్న ఈ చిత్రంలో కీలక పాత్ర చేయడానికి అనుష్క గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. జయసూర్య హీరోగా నటించబోతున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. కేరళలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో అనుష్క పాత్ర ‘అరుంధతి’ తరహాలో ఉంటుందని సమాచారం.

రోజిన్‌ థామస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 14 భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగాన్ని 2024లో విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ పేర్కొన్నారు. శుక్రవారం హీరో జయసూర్య పుట్టినరోజుసందర్భంగా గ్లింప్స్‌ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్‌ సందడి చేస్తోంది. అనుష్క తొలిసారి మలయాళ చిత్రంలో అదీ మహిళా ప్రాధానం ఉన్న కథ కావడం హాట్‌ టాపిక్‌గా మారింది.

తాజాగా అనుష్క తెలుగులో నటించిన ’మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు.పి దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో నవీన్‌ పోలిశెట్టి కథానాయకుడు. ఆయన స్టాండప్‌ కమెడీయన్‌గా నటించగా, అనుష్క, చెఫ్‌గా నటించారు.