Baahubali: The Epic Review: ‘బాహుబలి -ది ఎపిక్’ మూవీ రివ్యూ!

రచన -దర్శకత్వం : ఎస్ఎస్ రాజమౌళి

తారాగణం : ప్రభాస్, తమన్నా, అనూష్కా శెట్టి, రమ్య కృష్ణ, రానా,సత్యరాజ్, నాజర్ తదితరులు

సంగీతం : ఎం ఎం కీరవాణి,

ఛాయాగ్రహణం : సెంథిల్ కుమార్,

కూర్పు : ఎస్.ఎస్.రాజమౌళి – కోటగిరి వెంటకటేశ్వర్రావు – తమ్మిరాజు

బ్యానర్ : ఆర్కా మీడియా

నిర్మాతలు : శోభు యార్లగడ్డ – ప్రసాద్ దేవి

విడుదల : అక్టోబర్ 31, 2025

రెబెల్ స్టార్ ప్రభాస్ – ఎస్ ఎస్ రాజమౌళిల క్రేజీ కాంబినేన్ లో 2015లో విడుదలైన ‘బాహుబలి: ది బిగినింగ్’, మొదటి భాగం, 2017లో విడుదలైన ‘బాహుబలి: ది కంక్లూజన్’ రెండో భాగం రెండూ అంతర్జాతీయంగా అన్ని రికార్డులూ బ్రేక్ చెశాయి. ఈ రెండు భాగాలనూ కలిపి “బాహుబలి: ది ఎపిక్”గా ఈవారం విడుదల చేశారు. ‘బాహుబలి’ మొదటి భాగం విడుదలైన 10 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రేక్షకులకి అందించారు. దీన్ని నేటి ఆధునిక టెక్నాలజీకి సరితూగేలా ఎడిటింగ్ తో కుదించి అప్డేట్ చేసి ,IMAX, 4DX, D-BOX, EPIQ సపోర్ట్ ఫార్మాట్ట్స్ లో, డాల్బీ సౌండ్ సిస్టం లో ఒక అనిర్వచనీయ అనుభూతినిచ్చేందుకు సిద్ధం చేసి -పానిండియా, ఓవర్సీస్ మార్కెట్లలో విడుదల చేశారు. ఇప్పటికే ఈ రెండు సినిమాలని ప్రేక్షకులు ఎన్నోసార్లు చూసి వుంటారు. అయినా రెండూ కలిపి ఒకే సినిమాగా చూసే అవకాశాన్ని కల్పిస్తూ చేసిన ఈ ప్రయత్నం ఎలా వుందో చూద్దాం…

కథేమిటి?

కథ అందరికీ తెలిసిందే. ఒక గిరిజన గూడెం లో పుట్టిన శివుడు (ప్రభాస్)

పెరిగి పెద్దవాడై, తన తల్లిని విడిపించడానికి మాహిష్మతి రాజ్యానికి వెళ్తాడు. అక్కడ తన తండ్రి అమరేంద్ర బాహుబలి గురించి నిజం తెలుసుకుని, భల్లాలదేవుడు (రానా) ని చంపి రాజ్యాన్ని ఎలా స్వాధీనం చేసుకున్నాడనేది కథ.

ఈ రెండు భాగాల కథని – దాదాపు ఆరు గంటలు పైగా నిడివి వున్న కథని- మూడు గంటల 45 నిమిషాలకి కుదించినప్పుడు సహజంగానే చాలా సన్నివేశాలు కత్తిరింపుకి గురయ్యాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ లో ప్రభాస్- తమన్నాల మధ్య రోమాంటిక్ సీన్లు భారీగా ఎడిట్ అయ్యాయి. లవ్ ట్రాక్ ని సంక్షిప్తీ కరించిన ఫలితంగా ఏర్పడ్డ లోటుని రాజమౌళి వాయిసోవర్ తో భర్తీ చేశారు. ఫస్టాఫ్ మొదటి భాగం ఇంకా ఇతర సన్నివేశాల కత్తిరింపు తో కథ హడావిడిగా పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. సినిమాలో రెండు పాటలు కూడా పూర్తిగా ఎత్తేశారు. సెకండాఫ్ లోస్తే ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ ఉండేలా చూశారు. పోరాట సన్నివేశాల నిడివి కూడా తగ్గించారు. దాదాపు ఆరుగంటల సినిమాని నాల్గు గంటలకి కుదించి రెండు ఇంటర్వెల్స్ ఇచ్చి ఉండొచ్చు. దీంతో ప్రేక్షకులకి కాస్త రిలీఫ్ వుండేది. ఇలా కాకుండా ఒకే ఇంటర్వెల్ తో నాలుగు గంటలు కూర్చుని చూసిన సినిమానే చూడాల్సి రావడంతో అలసిపోతారు ప్రేక్షకులు. పూర్వం రాజ్ కపూర్ తీసిన ‘మేరా నామ్ జోకర్’ నిడివి నాల్గు గంటలు. దీనికి అప్పట్లోనే రెండు ఇంతర్వెల్స్ ఇచ్చారు. రెండు ఇంటర్వెల్స్ వల్ల స్నాక్స్ కి, డ్రింక్స్ కి కూడా బిజినెస్ పె రుగుతుంది.

నటనలు- టెక్నాలజీ
అమాయకత్వం-వీరత్వం షేడ్స్ గల పాత్రలో ప్రభాస్ వీరవిహారానికి ఇప్పుడు కూడా చప్పట్లే. తమన్నా కనిపిస్తే కేరింతలే. రానా వస్తే ఆవేశమే, అనూష్కా-రమ్యకృష్ణ ల మెలోడ్రామాలతో ఎమోషన్సే. ఇలా అన్నిరసాలు ఒకేసారి కలిపి చూసే అనుభవం నిజంగానే బాహుబలిని ది ఎపిక్ గా మార్చింది.

టెక్నాలజీ ఇప్పుడు అప్డేట్ అయింది. అందుకని ఈ ఎపిక్ ఈ విషయంలో వెనుకబడింది. ఈ పదేళ్ళలో ఇంతకంటే అద్భుత విజువల్ వండర్స్ వచ్చాయి. అయితే ఈ ఎపిక్ కి గల ఎమోషనల్ బలం ముందు టెక్నాలజీ అభివృద్ధి పెద్దగా సమస్య కాదు. గుండెని తాకేదే సినిమా, మిగతా టెక్నాలజీ అంతా పైపైన ఆకర్షణే.

ఇందులో రాజమౌళి కొత్తగా కలిపిన సీన్లేమీ లేవు. ఉన్న సీన్లే చాలా కత్తిరించారు. చిత్రీకరణకి కొత్తగా టెక్నాలజీని జోడించడం కూడా సాధ్యం కాదు. గ్రేడింగ్ చేయడం తప్ప. అయితే ఈ టెక్నికల్ బలహీనతల్నిసెంథిల్ కుమార్ కెమెరా వర్క్, కీరవాణి సంగీతం బాగా కవర్ చేశాయి. పురాణాలు ప్రతిఫలించే జానపద కథ కావడంతో ఆత్మికంగా ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతారు. అయితే భారీగా కత్తరింపుల వల్ల బలమైన సంభాషణలు చాలా చోట్ల ఎగిరిపోయాయి.

మొత్తంగా చూస్తే ఈ ఎపిక్ ఫ్లాపులతో వున్న ప్రభాస్ కి మళ్ళీ ఊపుని తీసుకొచ్చే మాస్టర్ పీస్. రాజమౌళి ఖాతాలో కొత్తగా పడేదేమీ లేదు. రెండు బాహుబలుల తర్వాత త్రిపులార్ తో ఆల్రెడీ మరో మెట్టు ఎక్కారు. ఇప్పుడు మహేష్ బాబుతో మరో బ్లాక్ బస్తర్ ముందుకు తెబోతున్నారు. అలాగే తమన్నా,అనుష్కా లకి కూడా కొత్తగా వచ్చే మార్కెట్ కూడా వుండదు. ప్రభాస్ కి, ప్రేక్షకులకి మరో సెలెబ్రేషన్ ఈ ఎపిక్ మూవీ!

రేటింగ్: 3 /5

Chinta Rajasekhar About Amaravati Land Pooling Behind Secret | Chandrababu | Telugu Rajyam