ఓ మహిళ నెల రోజుల్లో రెండు సార్లు ప్రసవించి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఇప్పుడు అందరిని షాక్ కు గురి చేస్తుంది. బంగ్లాదేశ్ జస్సోర్ జిల్లాకు చెందిన ఓ 20 ఏండ్ల మహిళకు నెల క్రితం ప్రసవం అయ్యింది. అప్పుడు ఓ పాపకు జన్మనిచ్చింది. పాపకు జన్మనిచ్చి 26 రోజుల తర్వాత మహిళకు మళ్లీ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. దీంతో మహిళ కడుపులో కవల పిల్లలున్నట్టు వైద్యులు గుర్తించారు. దీనిని గమనించి వైద్యులు షాక్ కు గురయ్యారు. ఆపరేషన్ చేయగా అమ్మాయి అబ్బాయి జన్మించారు. ప్రస్తుతం తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు.
మొదటి సారి డెలివరి చేసినప్పుడు వైద్యులు ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆస్పత్రి సూపరిండెంట్ అన్నారు. ఇలా జరగడాన్ని తన సర్వీస్ లోనే చూడలేదన్నారు. నిర్లక్ష్యం వహించిన వైద్యుల పై చర్యలు తీసుకుంటామన్నారు. ముగ్గురు పిల్లలు జన్మించినందుకు సంతోషంగా ఉన్నా తాము పేద వారిమని వీరిని ఎలా సాకాలని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఉన్నంతలో మంచి గా చూసుకుంటానని మహిళ భర్త చెప్పి తన తండ్రి ప్రేమను చాటుకున్నాడు.