కేరళలోని శబరిమలలో ఇద్దరు మహిళా భక్తులు అయ్యప్పను దర్శించుకొని చరిత్ర సృష్టించారు. శబరి మలలో 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు అయ్యప్పను దర్శించుకోవడం పై నిషేధం ఉంది. ఇటీవల ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దాంతో కేరళ ప్రభుత్వం మహిళల దర్శనానికి అనుమతినివ్వగా పలువురు అయ్యప్ప భక్తులు దానిని అడ్డుకున్నారు. అయితే ప్రస్తుతం ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకోవడం చర్చనీయాంశమైంది.
బుధవారం తెల్లవారు జామున 3.40 నిమిషాల సమయంలో 40 సంవత్సాలు ఉన్న ఇద్దరు మహిళలు అయ్యప్ప దేవస్థానంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత అందరితో పాటు వారు కూడా దేవున్ని దర్శనం చేసుకున్నారు.
అయ్యప్పను దర్శనం చేసుకునేందుకు బిందు, కనకదుర్గలు ఇద్దరు కూడా 3.40 కి ఆలయానికి చేరుకున్నారు. వారు ఆలయం వద్దకు వచ్చిన సమయాన మీడియా ప్రతినిధులు అక్కడ లేరు. భక్తుల రద్దీ కూడా చాలా తక్కువ ఉంది. వారికి రక్షణగా వచ్చిన పోలీసులు కూడా చాలా తక్కువే. చీకటిగా ఉండడం, తెల్లవారుజాము సమయం కావడంతో వీరిని ఎవరూ గుర్తుపట్టలేదు. మణికంఠ దర్శనం చేసుకొని వారు వచ్చారు. వీరు దర్శనం చేసుకున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ దృవీకరించారు.
కేరళ ప్రభుత్వం ప్లాన్ తోనే మహిళలను గుడికి పంపించిందని బిజెపి నాయకులు విమర్శించారు. మహిళలు ఆలయంలోకి ప్రవేశించడాన్ని ట్రావెన్ కోర్ దేవస్థానం తప్పుపట్టింది. మహిళల ప్రవేశంతో ఆలయం అపవిత్రత జరిగిందని శుద్ది చేస్తున్నారు. ఆలయాన్ని మూసివేసి శుద్ది చేస్తున్నారు. ఆలయాన్ని రెండు రోజుల పాటు మూసివేస్తున్నామని ప్రకటించారు.
శబరిమలలో దర్శనం చేసుకున్న బిందు, కనక దుర్గల నేపథ్యమిదే
బిందు, కనకదుర్గ… ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని టీవీ చానళ్లలో వినిపిస్తున్న పేర్లు. దశాబ్దాల సంప్రదాయాన్ని, భక్తుల మనోభావాలను తోసిరాజని శబరిమలలోని అయ్యప్పను దర్శించుకున్న మహిళలు.
బిందు వయసు 44 సంవత్సరాలు. సీపీఐ (ఎం) కార్యకర్త. కేరళలోని ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ గా ఆమె పనిచేస్తున్నారు. విద్యార్దులకు పాఠాలు చెబుతూనే పార్టీ కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటారు. సమాజ సేవ చేసే గుణం బిందుకు అధికంగా ఉందని తెలుస్తోంది. ఉన్నత చదువులు చదివిన బిందు పేదరికాన్ని రూపుమాపేందుకు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నది. మంచి గురువుగా విద్యార్దుల్లో పేరు సంపాదించుకుంది.
కనకదుర్గ వయసు 42 సంవత్సాలు. కేరళ ప్రభుత్వ పౌర సరఫరాల విభాగంలో పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా కూడా ఆమె సమాజ సేవకోసమే ఆలోచిస్తారని తెలుస్తోంది. ఇంత వరకు తన సర్వీసులో కనకదుర్గ పై ఒక్క రిమార్క్ కూడా లేదు.
వీరిద్దరూ గత నెల 24న ఆలయానికి వచ్చి స్వామిని దర్శించకుండా వెనక్కు తిరిగి వెళ్లిపోయిన 11 మంది మహిళల బృందంలో ఉన్నారు. మకరవిళక్కు సందర్భంగా డిసెంబర్ 30న ఆలయాన్ని తెరిచారు. ఆపై రెండు రోజుల తరువాత భక్తుల సంఖ్య బాగా పలచబడటంతో వారి కోరిక నెరవేరింది. శబరిమలలో మహిళల ప్రవేశానికి మద్దతుగా సీపీఎం పార్టీ 620 కిలోమీటర్ల మానవహారం నిర్వహించింది. మానవహారం నిర్వహించిన మరుసటి రోజే మహిళల ప్రవేశం జరిగింది.
మహిళల ప్రవేశం పై బ్రిగేడ్ కార్యకర్త తృప్తి దేశాయ్ స్పందించారు. ఆమె ఏమన్నారంటే
శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం ద్వారా నారీ శక్తి ఏంటన్న విషయం మరోసారి ప్రపంచానికి తెలిసి వచ్చిందని భూమాతా బ్రిగేడ్ కార్యకర్త తృప్తీ దేశాయ్ అన్నారు. నెలన్నర క్రితం తాను చేయలేకపోయిన పనిని నేడు బిందు, కనకదుర్గలు చేసి చూపించారన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. ఇద్దరు మహిళలను స్వామి సన్నిధికి పంపిన కేరళ సర్కారుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
అతి త్వరలో తాను కూడా ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకుంటానన్నారు. మహిళల ప్రవేశంతో అనాదిగా వస్తున్న చాందస సంస్కృతి తుడిచిపెట్టుకుపోయిందని ఆమె అభిప్రాయపడ్డారు. వారి ప్రవేశం తరువాత గర్భగుడి తలుపులు మూసివేయడం, శుద్ధి చేయాలని నిర్ణయించడాన్ని ఆమె ప్రశ్నించారు. ఇది యావత్ భారత మహిళలకే అవమానమని మండిపడ్డారు.