నటి సుమలతా అంబరీష్ నామినేషన్ మాండ్యలోక్ సభ స్థానానికి నామినేషన్ వేశారు. అయితే, అది ఈ వాక్యమంత చిన్న విశేషం కాదు. ఆమె నామినేషన్ కర్నాటకలో సంచలనం సృష్టిస్తూంది. అక్కడొక చర్చకు కూడా తావిచ్చింది. ఆమె గనక అత్యధిక మెజారిటీతో గెలుపొందితే, కర్నాటర రాజకీయాలలో అదొక కొత్త మలుపు అవుతుందని చెబుతున్నారు.
ఆమె ఎన్నికల అంబరీష్ కు ఉన్న అభిమానానికి పరీక్ష అని , ఈపరీక్షలో నెగ్గితే, ఆమె ఒక ప్రాంతీయ పార్టీ పెట్టినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. మొత్తానికి సుమలత పోటీ కాంగ్రెస్ , జెడిఎస్ లలో ప్రకంపనలు సృష్టించింది.
సినిమా నటులు ప్రాంతీయ పార్టీలు పెట్టడం ఆంధ్ర తమిళనాడులలో ఉంది. ఇదింకా కర్నాటక దాకా పాక లేదు. కర్నాకటనుంచి నటులు రాజకీయాల్లోకి వచ్చినా వాళ్లె ఏదో ఒక పార్టీలో అంబరీష్ లాగా అడ్జస్ట్ అయిపోతున్నారే తప్ప ఎవరూ ప్రాంతీయ పార్టీ పెట్టే ప్రయత్నం చేయలేదు. ఈ ప్రయత్నం సుమలత చేసే అవకాశం ఉంది,అయితే, అది ఎన్నికల ఫలితాలను బట్టి ఉంటుందని చెబుతున్నారు. ఆ మధ్య శాండల్ వుడ్ నటుడు ఉపేంద్ర కర్నాటక ప్రజ్జావంత జనతా పక్ష (Karnataka Prajnavanta Janata Paksha) నుంచి బయటకు వచ్చి ప్రాంతీయ పార్టీ పెడతానని చెప్పారు. ఇది జరిగి దాదాపు ఒక ఏడాది అవుతున్నా అది కార్యరూపం దాల్చలేదు. లోక్ సభ ఎన్నికల్లో సుమలత గెలిస్తే మరొక కొత్త ప్రాంతీయ పార్టీ వచ్చే అవకాశం ఉందనే మాట మాండ్యలో వినబడుతూ ఉంది.
బిజెపి ఆహ్వానించినా, కాంగ్రెస్ మరొక సీటు కేటాయిస్తానని చెప్పినా వినకుండా ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా బుధవారం నాడు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో జనం వచ్చారు. ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా అమలుచేస్తున్న పథకమని, ఆమె అంబరీష్ పలుకుబడి, అభిమానం తగ్గలేదని నిరూపించేందుకే ఇండిపెండెంటుగా పోటీ చేస్తున్నారని ప్రజలు అంటున్నారు.
చిత్రమేమిటంటే, కాంగ్రెస్ జెండాలు పట్టుకుని కూడా నిన్న అభిమానులు ఆమె ర్యాలీకి వచ్చారు. జనతా దళ్ ఎస్ కార్యకర్తులూ జై అంటూ హాజరయ్యారు. ఇటీవల మరణించిన అంబరీష్ అభిమానులు , దళిత సంఘాల నాయకులు, అదివాసి, మైనారిటీ సంఘాల వాళ్లు, కర్నాటక రాజ్య రైత సంఘ నేతలు మాండ్య డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి తరలివచ్చారు. అంతా సుమలత జై అని నినాదాలు ఇచ్చారు. తాను మహిళ కాబట్టే తనని ఖాతరు చేయడం లేదని,తనను అవమానిస్తున్నారనే అనుమానం ఆమెలో బలంగా ఉంది. అందుకే జెడిఎస్, కాంగ్రెస్ లను దెబ్బతీయాలని ఆమె నిర్ణయించుకున్నారు.
సుమలత డిసి కార్యాలయంలోకి వెళ్లుతున్నపుడు అంబరీష్ సినిమాలోని పాటలు కూడా పెట్టారు. అంబరీష్ అభిమానులు బైక్ ర్యాలీతో తరలివచ్చారు. ఈ ర్యాలీ సుమలత కు ఎంత బలగం ఉందో చెబుతుంది. నామినేషన్ వేశాక సుమలత రోడ్ షోలు మొదలు పెట్టారు.
రాకింగ్ స్టార్ యాష్, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, దొడ్డన్న, రాక్ లైన్ వేంకటేశ్ ఆమెతో పాటే ఉన్నారు. క్యాంపెయిన్ లో తామంతా సుమలత తోనే ఉంటామని వారు ప్రకటించారు. అయితే, ఇది ప్రభుత్వం పెద్దలకు ఆగ్రహం తెప్పిస్తూ ఉంది. జయ కర్నాటక, కర్నాకట రక్షణ వేదిక సినిమా నటులు క్యాంపెయిన్ లో పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ నటులంతా క్యాంపెయిన్ లో పాల్గొంటున్నందున లోక్ సభ ఎన్నికలయ్యే వరకు వారి సినిమాలను ప్రదర్శించకుడా నిషేధించాలని జయ కర్నాకట రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ చంద్రప్ప కమిషన్ కు లేఖ రాశారు. సుమలత పలుకుబడి వల్ల ముఖ్యమంత్రి కుమార స్వామి కుమారుడు నిఖిల్ కుమార స్వామి విజయకావశాలు దెబ్బతింటాయని సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్, జెడి (ఎస్ ) పార్టీలు సుమలత మీద ఆగ్రహంతో ఉండటంతో బిజెపి ఆమెకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉంది.
ఇండిపెండెంటుగా పోటీ చేస్తున్న సుమలతకు బిజెపి మద్దతునిచ్చే అవకాశం ఉందని పార్టీ నేత యడ్యూరప్పచెప్పారు. సుమలతా పెరుగుతున్ జనాదరణను విస్మరించడానికి వీల్లేదని ఆయన తెలిపారు. బిజెపి 28 లో క్ సభ స్థానాలలో పోటీ చేయాలనుకుంటున్నదని, అయితే, మాండ్యలో ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని సుమలతకు మద్దతునిచ్చే అవకాశం లేకపోలేదని ఆయన చెప్పారు.
మరొక వైపు సినిమానటులు సుమలతకు అనుకూలంగా ప్రచారం చేస్తే ఐటి దాడుల జరిపిస్తామని రూలింగ్ పార్టీలు బెదిరిస్తున్నారు.