కంచే చేను మేస్తే అన్న చందంగా.. కాపీ రైట్ చట్టాల గురించి బాగా తెలిసిన టీవీ చానెల్ యాజమాన్యాలు ఇలా చేయడం ఏమైనా బావుందా? ఇంతకీ ఆ చానెల్ వాళ్లు ఏం చేశారంటే.. కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించి అడ్డగోలుగా తమది కాని సినిమాని ప్రసారం చేసి బుక్కయ్యారు. KGF చాప్టర్ 1 చిత్రాన్ని చట్టవిరుద్ధంగా తమ చానెల్ లో ప్రసారం చేసిన ఓ తెలుగు టీవీ చానెల్ పై చిత్రనిర్మాతలు దావా వేసేందుకు సిద్ధమవ్వడం టాలీవుడ్ లో చర్చకొచ్చింది.
యష్ కథానాయకుడిగా నటించిన సెన్సేషనల్ హిట్ చిత్రం కెజిఎఫ్ శాటిలైట్ హక్కులు వేరొక చానెల్ కలిగి ఉన్నప్పటికీ దానిని చట్ట విరుద్ధంగా వేరొక చానెల్ లో ప్రసారం చేయడంతో చిత్ర నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇంకా శాటిలైట్ డీల్ ఏదీ తేలక ముందే సదరు స్థానిక ఛానెల్ ఇప్పటికే ఈ సినిమాను ప్రసారం చేసేసిందన్నది ప్రధాన ఆరోపణ.
కేజీఎఫ్ 1 క్రియేటివ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత కార్తీక్ గౌడ మాట్లాడుతూ..“# ఎవ్రీ అనే తెలుగు స్థానిక ఛానల్ KGF సినిమాను చట్టవిరుద్ధంగా ప్రసారం చేస్తోంది. మేం వారిపై చట్టబద్ధంగా వెళతాం. వారిపై దావా వేస్తాం. శాటిలైట్ ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. దాదాపు వేరొక చానెల్ తో డీల్ ఖరారు చేసుకున్నాం. కానీ ఈలోగానే సదరు కేబుల్ ఛానెల్ ఇలాంటి తప్పు చేసింది“ అని తెలిపారు. అంతేకాదు.. ఆ చానెల్లో టెలీకాస్ట్ అవుతున్న దృశ్యాల్ని స్క్రీన్‌షాట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫోటోలు.. వీడియోలతో మాకు ప్రూఫ్ ఉంది కోర్టులో పోరాడేందుకు అని తెలిపారు.
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదలైంది. ఇది అన్నిచోట్లా విపరీతమైన ప్రజాదరణ పొందింది. దాదాపు 350 కోట్లు సూలు చేసింది. ఈ సినిమా సీక్వెల్ సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే.
కేజీఎఫ్: చాప్టర్ 2 ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. అక్టోబర్ 23 న విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించినా కరోనా లాక్డౌన్ కారణంగా డిసెంబర్‌కు వాయిదా వేయనున్నారని తెలుస్తోంది. అయితే చిత్రబృందం నుంచి దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖులు సంజయ్ దత్, రవీనా టాండన్ కూడా కీలక పాత్రల్లో నటించారు.