తెరపైకి కర్ణాటకలో మంగళగిరి స్టోరీ!

ఏపీ రాజకీయాల్లో గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడి హోదాలో, మాజీ మంత్రి నారాలోకేష్ ఈ నియోజకవర్గంలో మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేశారు. అమరావతి రాజధాని ప్రాంతం ఎఫెక్ట్ కచ్చితంగా తన గెలుపులో కీలక భూమిక పోషిస్తుందని నమ్మారు. అయితే… ఎఫెక్ట్ చూపించింది కానీ… అది రివర్స్ లో! అయితే… తాజాగా వెలువడిన కర్ణాటక ఎన్నికల్లో కూడా ఒక మంగళగిరి నియోజకవర్గం తెరపైకి వచ్చింది.

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో హంగ్ ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ ఉందని జేడీఎస్ బలంగా నమ్మింది. ఈ విషయంలో జేడీఎస్ అధినేత ఒక అడుగుముందుకేసి… తానే కాబోయే ముఖ్యమంత్రి అన్న రేంజ్ లో ప్రచారం చేసుకున్నారు కూడా. అయితే… నాయౌడు ఒకటి తలిస్తే.. ప్రజలు మరొకటి తలిచారు. ఇక్కడ ఆసక్తికరమైన మరో అంశం ఏమిటంటే… మాజీ ముఖ్యమంత్రి కుమారుడి హోదాలో కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామీ ఈ ఎన్నికల్లో పోటీచేశాడు.

జేడీఎస్ కు కంచుకోట అయిన రామ‌న‌గ‌ర నియోజకవర్గం నుంచి నిఖిల్ ఓట‌మి పాల‌య్యాడు. కాంగ్రెస్ అభ్య‌ర్థి ఇక్క‌డ ఘ‌న‌విజ‌యం సాధించాడు. నిఖిల్ కు అవ‌కాశం ఇవ్వ‌డానికి ఆయ‌న త‌ల్లి ఈ సీటును త్యాగం చేశారు. ఇలా తండ్రి సీఎం అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ఎన్నిక‌ల్లో త‌న‌యుడు ఓట‌మి పాల‌య్యాడు. దీంతో… మంగళగిరిలో లోకేష్ పరిస్థితిని నిఖిల్ తో కలిపి పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. ఇకపై లోకేష్ ఏమీ ఫీలవ్వనక్కరలేదని… నిఖిల్ తోడయ్యాడని సెటైర్స్ వేస్తున్నారు!