వివాహ శుభవేళ, ఆ మధుర క్షణాలు జీవితాంతం గుర్తుండి పోయేలా ఫోటోలు దిగడం సర్వసాధారణం. అందుకోసం పెళ్లికి ముందు, పెళ్లి తరువాత వివిధ సందర్భాల్లో ఫోటోలు దిగుతూ ఉంటారు. మారుతున్నకాలానుగుణంగా పెళ్లికి ముందే ఫోటో ఆల్బమ్స్ తయారు చేసే స్టూడియోలు పుట్టుకొచ్చాయి.
దీంతో తాము ఎంతో కాలం నుంచి పరిచయం ఉన్న వాళ్లలా వధూ వరూలు పోటి పడి మరీ ఫోటోలు దిగుతూ ఫోటో స్టిల్స్ కొరకు పోజులిస్తున్నారు. తాజాగా, కేరళలోని కొచ్చి సమీపంలోని చెరతాల గ్రామంలో బిచూ ప్రతాపన్, ఇందు తీయించుకున్న పెళ్లి ఫోటోలు సామాజిక మాధ్యమాల పుణ్యమాని వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను ఒక్క గంటలోనే లక్ష మంది చూశారు.
వీరిద్దరూ పెరట్లోని ఓ చిన్న నీటి కుంటలో ‘ఉరిలి’గా పిలిచే తట్టలో పరస్పరం అభిముఖంగా ఒదిగి, పై నుంచి వర్షపు జల్లులు కురుస్తుండగా, తన్మయత్వంతో మునిగి తేలుతున్నట్టు ఓ ఫోటో తీయించుకున్నారు. అప్పుడు అక్కడ వర్షం లేదు. వారు అంత తన్మయత్వాన్నీ పొంది వుండరు. కానీ, ఈ చిత్రం మాత్రం దూసుకుపోతోంది. దాదాపు పదేళ్లుగా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్న సిద్ధార్థ్, ఈ ఫోటో తీశాడు. ఆ ఫోటోలను మీరూ చూడండి.