జైలులో శశికళతో సమావేశమైన విజయశాంతి

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నేత శశికళతో కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి భేటి అయినట్టు తెలుస్తోంది. గురువారం విజయశాంతి కర్ణాటకలోని పరప్పణ అగ్రహార జైలులో ఉన్న శశికళతో విజయశాంతి గంటకు పైగా భేటి అయినట్టు సమాచారం. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ పై శశికళ విజయశాంతిని ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఫ్రంట్ లో చేరితే ఎలా ఉంటుంది, రాజకీయ పరిస్థితుల పై వీరి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది.

శశికళకు, విజయ శాంతికి గతంలో నుండే పరిచయం ఉంది. తరచు సినిమా షూటింగ్ లకు చైన్నై వెళ్లే విజయశాంతికి అప్పటి నుంచే శశికళ, జయలలితతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారిని ఆప్తమిత్రులుగా తయారు చేసిందని తెలుస్తోంది. జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళను విజయశాంతి ఇప్పటికే చాలా సార్లు కలిశారు. ఇటీవల ఆర్కే నగర్ కు జరిగిన ఉప ఎన్నికల్లో శశికళ బంధువు దినకరన్ కు మద్దతుగా విజయశాంతి ప్రచారం నిర్వహించారు. శశికళ, విజయశాంతి తాజా కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది.  

వీరిద్దరి మధ్య భేటిలో రాజకీయ అంశాలే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కూటమిలో అన్నాడిఎంకే చేరాలని విజయశాంతి ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ కూటమి ఎలా ఉందని దాంతో కలిగే ప్రయోజనాల పై శశికళ ఆరా తీసినట్టు సమాచారం. కాగా విజయశాంతి మాత్రం కాంగ్రెస్ తో కలవాలని, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకే అనుకూల పవనాలు ఉన్నాయని చెప్పారట. దేశ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని బిజెపిని ప్రజలు బిజెపిని నమ్మే పరిస్థితి లేదని విజయశాంతి అన్నట్టు సమాచారం.

విజయశాంతి కాంగ్రెస్ తరపున శశికళతో చర్చించేందుకే వెళ్లారని కాంగ్రెస్ నేతల ద్వారా తెలుస్తోంది. బిజెపిని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది. దీంతో దేశ వ్యాప్తంగా కలిసొచ్చే పార్టీలతో కాంగ్రెస్ పార్టీ చర్చిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే అభ్యర్దులను ప్రకటించి అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే కలిసొచ్చే పార్టీలతో ఇప్పటి నుంచే చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. పార్టీలు కలిసొస్తే సీట్ల పంపకాలు చేసి అభ్యర్దులను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహా రచనలు చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ కీలక నేతలు వివిధ పార్టీల నేతతలో చర్చలు ప్రారంభించారు.  

అన్నాడిఎంకే కి జయలలిత మరణం తర్వాత శశికళ పెద్ద దిక్కుగా మారారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె జైలులో ఉండడంతో పళని స్వామి, పన్నీరు సెల్వంలు ప్రభుత్వ బాధ్యతలతో పాటు, పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. వీరు కూడా జైలులో ఉన్న శశికళ ఆదేశాలతోనే పార్టీ, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళుతున్నారని సమాచారం. దీంతో విజయశాంతి తనకున్న పరిచయంతో శశికళను కలిశారు. రాజకీయ పరిస్థితుల పై చర్చించారు. మరీ శశికళ కాంగ్రెస్ కూటమికి జై కొడుతారో లేక ఏం నిర్ణయం తీసుకుంటారోనన్నది మాత్రం చర్చనీయాంశమైంది.