UP Exit Polls 2022: యూపీ ఎగ్జిట్ పోల్స్ అవుట్.. బీజేపీకి మళ్లీ పట్టం కడతారా..?

ఇండియాలో ఐదు రాష్ట్రాల్లో జ‌రిగిన‌ అసెంబ్లీ ఎన్నిక‌లు నేటితో ముగిసాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై తీవ్ర ఉత్కంఠం నెల‌కొంది. దీంతో ఐదు రాష్ట్రాల్లో ఓట‌ర్ల నాడి ఎలా ఉందో తెలుసుకునేందుకు ప‌లు స‌ర్వే సంస్థ‌లు స‌ర్వేలు నిర్వ‌హించాయి. ఈరోజుతో ఎన్నిక‌ల కోడ్ అయిపోవ‌డంతో స‌ర్వే సంస్థ‌లు ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల చేశాయి.

దేశంలో అతిపెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర ప్ర‌దేశ్ అసెంబ్లీ రిజ‌ల్ట్ స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా యూపీ ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు విడుద‌ల చేశాయి. యూపీలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా, అక్క‌డ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 202 స్థానాల్లో గెలవాల్సి ఉంది. 2017 ఎన్నికల్లో బీజేపీ 312 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ‌రి ఈసారి అక్క‌డ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయి.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.

P-MARQ ఎగ్జిట్ పోల్ :

P-MARQ ఎగ్జిట్ పోల్ ప్ర‌కారం.. యూపీలో ఉన్న మొత్తం 403 స్థానాల‌కు గానూ.. అధికార బీజేపీ 240 ద‌క్కించుకుని అక్క‌డ మ‌రోసారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాయ‌ని P-MARQ స‌ర్వే సంస్థ చేసిన స‌ర్వేలో తేలింది. ఇక స‌మాజ్ వాదీ పార్టీకి 140 సీట్లు, బీఎస్‌పీకి 17సీట్లు, కాంగ్రెస్‌కు 4 సీట్లు, ఇత‌రుల‌కు 2 సీట్లు వ‌స్తాయ‌ని P-MARQ ఎగ్జిట్ పోల్ పేర్కొంది.

రిపబ్లిక్ టీవీ సర్వే :

రిపబ్లిక్ టీవీ సర్వే ప్రకారం.. యూపీలో ఉన్న 403 స్థానాల్లో 262 నుంచి 277 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని తేల్చింది. సమాజ్ వాదీ పార్టీ 119 నుంచి 134 స్థానాలను సాధించే అవకాశముందని తేల్చింది. కాంగ్రెస్ మూడు నుంచి ఎనిమిది స్థానాలు, బీఎస్పీ ఒకటి నుంచి మూడు స్థానాల్లో మాత్ర‌మే గెలిచే అవ‌కాశం ఉంద‌ని రిపబ్లిక్ టీవీ వెల్లడించింది.

పీపుల్స్‌ పల్స్‌ సర్వే :

పీపుల్స్‌ పల్స్‌ సర్వే ప్రకారం.. బీజేపీ అండ్ మిత్రపక్షాలు కలిసి 220 నుంచి 240 వరకు సీట్ల‌లో గెలుపొందే అవ‌కాశం ఉంద‌ని పోస్ట్‌ పోల్‌ సర్వే తెలిపింది. అలాగే సమాజ్‌వాదీ పార్టీ దాని మిత్రపక్షాలకు కలిపి 140 నుంచి 160 స్థానాల్లో విజ‌యం సాధించే అవ‌కాశం ఉంద‌ని పీపుల్స్ ప‌ల్స్ పేర్కొంది. బహుజన సమాజ్‌వాదీ పార్టీ 12 నుంచి 18 సీట్లు గెలిచే చాన్స్ ఉంద‌ని, ఆర్‌ఎల్‌డీ 8 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని, కాంగ్రెస్‌ పార్టీ 6 నుంచి 10 స్థానాలకు పరిమితమ‌వుతుంద‌ని పీపుల్స్ ప‌ల్స్ స‌ర్వే పేర్కొంది.

టౌమ్స్ నౌ ఒపీనియన్ పోల్ :

టౌమ్స్ నౌ ఒపీనియన్ పోల్ ప్ర‌కారం.. 2017 ఎన్నిక‌ల్లో కంటే మెజారిటీ త‌గ్గినా మ‌రోసారి అధికారం మాత్రం బీజేపీదే అని టైమ్స్ నౌ పేర్కొంది. మొత్తం 403 స్థానాల‌కు బీజేపీ అండ్ మిత్ర‌ప‌క్షాలు క‌లుపుకుని 227-254 సీట్లు సాధిస్తుందని పేర్కొంది. సమాజ్‌వాదీ పార్టీ, దాని మిత్రపక్షాలకు 136-151 సీట్లు వ‌స్తాయ‌ని, బీఎస్పీకి 8-14 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని, కాంగ్రెస్‌కు 6-11 సీట్ల‌కే ప‌రిమితం అవుతుంద‌ని టైమ్స్ నౌ ఒపీనియ‌న్ పోల్స్ పేర్కొంది.

మ్యాట్రిజ్ పోల్ :

మ్యాట్రిజ్ పోల్ ప్ర‌కారం.. మొత్తం 403 సీట్ల‌కు గానూ.. బీజేపీ అండ్ మిత్ర‌ప‌క్షాల‌కు 211 నుంచి 225 సీట్లలో విజ‌యం సాధించే అవ‌కాశం ఉంద‌ని, స‌మాజ్ వాదీ పార్టీ , దాని మిత్ర‌ప‌క్షాల‌కు 146 నుంచి 160 సీట్లు దక్కే ఛాన్స్ ఉంది. బీఎస్పీ 14-24 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఇక కాంగ్రెస్ 4 నుండి 6 స్థానాల‌కు ప‌రిమితం అయ్యి అట్టర్ ఫ్లాప్ అయిందని మ్యాట్రిజ్ పోల్ పేర్కొంది.

ఈటీజీ రీసెర్చ్ :

ఈటీజీ రీసర్చ్ సర్వే ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లో ఉన్న మొత్తం 403 సీట్ల‌కు గానూ.. బీజేపీ, దాని మిత్ర‌ప‌క్షాల‌కు 230 నుంచి 245 స్థానాలు వస్తాయని ఈటీజీ రీసెర్చ్ అంచనా వేసింది. అలాగే సమాజ్‌వాదీ పార్టీ, దాని మిత్ర ప‌క్షాల‌కు 150 నుంచి 165 స్థానాలతో రెండో స్థానంలో నిలుస్తుంద‌ని ఈటీజీ పేర్కొంది. ఇక బీఎస్పీ 5-10, కాంగ్రెస్ 2-6 సీట్లకు మాత్రమే పరిమితమవుతుంద‌ని, ఇతర పార్టీలు కూడా పెద్దగా ప్రభావం చూపలేద‌ని ఈటీజీ రీసెర్చ్ పేర్కొంది.

ఇక మొత్తంగా చూసుకుంటే.. దాదాపు అన్ని స‌ర్వే సంస్థలూ ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో మ‌రోసారి బీజేపీనే విజ‌య‌బావుటా ఎగుర‌వేస్తుంద‌ని తేల్చి చెబుతున్నాయి. గ‌తంలో కంటే ఈసారి ఎన్నిక‌ల్లో సీట్లు తగ్గినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పరిపడా స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని అన్ని స‌ర్వేలు అభిప్రాయపడ్డాయి. ఇక బీజేపీకి సమాజ్‌వాదీ పార్టీ గట్టి పోటీ ఇచ్చింద‌ని, అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయ‌డానికి కావల్సిన సీట్లు ట్లు గెలవదని అన్ని స‌ర్వేలు స్పష్టం చేశాయి. ఇక కాంగ్రెస్‌తో స‌హా మిగ‌తా పార్టీల ప్రభావం పెద్దగా లేదని దాదాపుగా అన్ని స‌ర్వేలు వెల్లడించాయి.