దేశాన్ని రక్షించడానికి సరిహద్దుల్లో జవాన్లు రేయింబవళ్లు పహారా కాస్తుంటారు. దేశ సరిహద్దుకు అవతల చిన్న అలికిడి చోటు చేసుకున్నా, సైన్యం అప్రమత్తమౌతుంది. దేశ ప్రజలను కాపాడటానికి పోలీసు వ్యవస్థ ఉంది. సమాజాన్ని, ప్రజలను పరిరక్షించడానికి పోలీసులు అందుబాటులో ఉంటారు. అమర జవాన్లు, పోలీసుల త్యాగాల గురించి మనకు తెలుసు.
అడవులు, అటవీ సంపద, వన్యప్రాణులను పరిరక్షించే వ్యవస్థను ప్రజలు పెద్దగా పట్టించుకున్న సందర్భాలు లేవు. విధి నిర్వహణలో ఉంటూ అమరులైన అటవీ ఉద్యోగుల సంస్మరణ దినాన్ని ఏటా సెప్టెంబర్ 11వ తేదీన జరుపుకొంటాం. అంతటితో వదిలేస్తాం. అత్యంత విలువైన అటవీ సంపద, వన్యప్రాణులను సంరక్షించడానికి ప్రత్యేకంగా గార్డుల వ్యవస్థ ఉందనే విషయమే గుర్తుకు రాదు.
అటవీ గార్డులు ఆర్మీ, పోలీసు వ్యవస్థలకు ఏ మాత్రం తీసిపోరని చెబుతున్నారు ఉపాసన కొణిదెల. ప్రముఖ నటుడు రామ్‌చరణ్ భార్య. ఆమె రాజస్థాన్‌లోని రణథంబోర్ జాతీయ పార్కును ఉపాసన సందర్శించారు. `సేవ్ టైగర్స్` ప్రాజెక్టులో భాగంగా ఆమె అక్కడి అభయారణ్యాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అటవీ గార్డులతో కలిసి ఫొటో దిగారు.
వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు. అటవీ గార్డులు `దేశం గుర్తించని హీరో`లుగా కీర్తించారు. ఆర్మీ, పోలీసు వ్యవస్థలు ప్రజలను కాపాడుతుంటే..వాటికి సమాంతరంగా వన్యప్రాణులు, అటవీ సంపదను పరిరక్షించే హీరోలని ఆమె చెప్పారు. పచ్చటి ప్రకృతిని అహర్నిశలు కాపాడుతూ, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడుతున్నారని, వారి నుంచి తాను చాలా నేర్చుకున్నానని ఉపాసన అన్నారు.