తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్ తనయుడు సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్‌కు రాబోయే ఎన్నికల్లో డీఎంకే తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావించాడు. త్వరలో జరగనున్న తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నెలోని ‘చెపాక్’ లేదా థౌజండ్స్ లైట్స్ నియోజకవర్గం నుంచి డీఎంకే తరుపన పోటీ చేయాలని భావించాడు. ప్రస్తుతం పార్టీ యువజన సంఘ అధ్యక్షుడిగా ఉన్నాడు ఉదయనిధి స్టాలిన్. ఈ నేపథ్యంలోనే మార్చ్ 6న పార్టీ పెద్దల ముందు ప్రధాన కార్యాలయం అణ్ణా అరివాలయంలో హాజరయ్యాడు.
అక్కడ ఉదయనిధిని ఇంటర్వ్యూ చేసారు పార్టీ అధ్యక్షుడు, ఉదయనిధి తండ్రి స్టాలిన్, ప్రధాన కార్యదర్శి దురై మురుగన్. కానీ యువజన విభాగం కార్యదర్శిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ .. పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉంది. అలాంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తే తన నియోజకవర్గానికి పరిమితం కావాల్సిన పరిస్థితి వస్తోంది. ఆయనే స్వయంగా పోటీ చేస్తే.. అన్ని చోట్ల ఫోకస్ పెట్టలేరనే ఉద్దేశ్యంతో స్టాలిన్, దురై మురుగన్ అభిప్రాయపడినట్టు సమాచారం.
వారి సూచనల మేరకు ఉదయనిధి స్టాలిన్ పోటీ నుంచి వైదొలిగినట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఉదయనిధి ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగిస్తూ డీఎంకే పార్టీ తీర్మానం చేసింది. ఇక దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సినిమాలు, రాజకీయాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ రావడం అనేది ఎప్పట్నుంచో జరుగుతున్న పనే. ముఖ్యంగా సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం పెద్ద విశేషం కాదు. తెలుగు నాట అన్న ఎన్టీఆర్ తెలుగు దేశం అనే రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు.అంతకు ముందు ఎంజీఆర్ కూడా ఏఐఏడీఎంకే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. అదే బాటలో ఇప్పుడు చాలామంది నడుస్తున్నారు.