శత్రు దుర్బేధమైన కోట.. సాయుధ బలగాల పహారా.. మ్యూజియంలో ఎక్కడ అడుగుపెట్టినా, ఏ వస్తువును ముట్టుకున్నా టక్కున మోగే అలారం.. అయినా హీరో తన స్నేహితురాలితో కలిసి పై కప్పుకున్న వెంటిలేటర్ ను తొలగించి మ్యూజియంలోకి చొరబడి వజ్రాలు పొదిగిన కత్తిని అత్యంత చాకచాక్యంగా ఎత్తుకు పోతాడు. ఇది బాలీవుడ్ సినిమా ధూమ్ 2 లోని సీన్. అచ్చం అలాంటి సంఘటనే హైదరాబాద్ లో జరిగింది.
హైదరాబాద్ షాన్ అయినా నిజాం మ్యూజియం నుంచి వజ్రాలు పొదిగిన బంగారు పాత్రలు మాయమయ్యాయి. సీసీ కెమెరాల్లో దొంగల కాళ్లు తప్పా మరేమి రికార్డు కాలేదు. పక్కా స్కెచ్ తో కోట్ల విలువైన వజ్రాలను కొట్టుకెళ్లారు. సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ సంఘటన పోలీసులకు సవాల్ గా మారింది.
మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిజాం మ్యూజియం ఉంది. ఏడవ నిజాం ఉస్మాన్ అలీకాన్ తన 25 ఏండ్ల పాలన పూర్తయిన సంధర్బంగా 1937లో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ అభివృద్దికి సంబంధించి పలు వేడుకలు జరిగాయి. ఆయా వేడుకలకు వివిధ దేశాల నుంచి హాజరైన ఆయన సన్నిహితులు వెలకట్టలేని బహుమతులు అందజేశారు. వాటిని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో హెచ్ ఈహెచ్ పేరుతో ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. నిజాంకి వచ్చిన కానుకలన్నీ పురానీహవేలీలోని మ్యూజియంలో పెట్టి ప్రజలు సందర్శించేలా ట్రస్టీకి బాధ్యతలు అప్పగించారు.
ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సామాన్య ప్రజలు మ్యూజియాన్ని సందర్శించుకునే వీలు కల్పించారు. ఆదివారం సాయంత్రం మ్యూజియాన్ని మూసేసిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ షౌకత్ అలీ సోమవారం ఉదయం 9 గంటలకు తిరిగి తెరిచారు. లోపలికి వెళ్లగా విలువైన వస్తువులను భద్రపరిచిన అద్దాలు పగిలి ఉండటమే కాకుండా వస్తువులు చోరికి గురయ్యాయని గ్రహించాడు. నవరత్నాలు పొదిగిన టిఫిన్ బాక్స్, మూడో గ్యాలరీలో ఏర్పాటు ఉన్న పాత్రలు చోరికి గురయ్యాయి. ట్రస్టీ సభ్యులకు సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరికి గురైన బంగారు పాత్రల బరువు సుమారు 3 కిలోల వరకు ఉంటుందని, ప్రపంచ మార్కెట్ లో వాటి విలువ రూ. కోట్లలో ఉంటుందని పేర్కోన్నారు. మ్యూజియం రక్షణ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శులు వస్తున్నాయి.
నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇది మ్యూజియం గురించి అంతా తెలిసిన వ్యక్తులే చేసిన పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కాగా ఏ మాత్రం అనుమానం రాకుండా, ఆధారాలు లేకుండా చోరి చేయడంపై పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది తెలిసిన వ్యక్తుల పనేనని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అన్నారు.