న్యూ ఢిల్లీ: మోడీ ప్రభుత్వం తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా దేశ రాజధానిలో సాగుతున్న రైతుల పోరాటం గురించి అందరికి తెలుసు. రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం, రైతులు ఏమాత్రం వెనక్కితగ్గటం లేదు. ఇంతకాలం చాలా ఓర్పుతో కొనసాగిన ఉద్యమం తాజాగా ట్రాక్టర్ల ర్యాలీలో అనుకోకుండా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటంతో రైతు ఉద్యమం పక్క దారి పట్టినట్లైంది. ఈ సంఘటన తర్వాత రైతు సంఘాలతో చర్చలపై సందిగ్ధత నెలకొన్న సమయంలో ప్రధాని నరేంద్రమోడీ స్పందించటం ప్రాధాన్యతని సంతరించుకుంది.
బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో… ప్రధాని అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అఖిలపక్ష సమావేశం జరిగింది. అఖిలపక్ష సమావేశంలో మోడీ ప్రస్తావిస్తూ… తాము రైతులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గతంలో కేంద్రం ఇచ్చిన హామీ అయిన కొంతకాలం కొత్త చట్టాలు అమలు వాయిదా వేసేందుకు ఇప్పటికి కట్టుబడి ఉన్నామన్నారు. రైతు సంక్షేమం కోసం పనిచేస్తామని… ఈ బడ్జెట్ లో కూడా రైతులకు వరాలు ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. రైతుల అభ్యంతరాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటామన్నారు. అయితే, రాష్ట్రపతి ప్రసంగానికి 18 ప్రతిపక్ష పార్టీలు దూరంగా ఉన్న నేపథ్యంలో సమావేశాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకే రైతుల ఉద్యమంపై ప్రధాని ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది.