బీజేపీ నుంచి చంద్రబాబుకి పదే పదే అదే షాక్.!

ఎప్పుడెప్పుడు బీజేపీతో కలిసిపోదామా.? అని ఎదురుచూస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. కానీ, కమలనాథులు అంతలా తెలుగుదేశం పార్టీ పట్ల ఆసక్తి చూపించడంలేదన్న వాదనలున్నాయి. టీడీపీని కాదనుకుని బీజేపీ ఒంటరిగా రాష్ట్రంలో చేసేదేమీ వుండదు. మిత్రపక్షం జనసేన పార్టీని బీజేపీ పూర్తి స్థాయిలో నమ్మడంలేదు. అదే సమయంలో, జనసేన పార్టీని సైతం ఎదగనీయడంలేదు. టీడీపీ పంచనో, జనసేన పంచనో బీజేపీ చేరితే తప్ప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఎదుగుదల వుండదన్నది నిర్వివాదాంశం. బీజేపీ సొంత బలం ఏంటందన్నది ఏపీ బీజేపీ నేతలకు బాగా తెలుసు. కానీ, తమ స్థాయికి మించిన మాటలు కమలనాథుల నుంచి వస్తుంటాయి. ఈ తరుణంలో బీజేపీని ఎలాగైనా ఒప్పించి తమ దారికి తెచ్చుకోవాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ప్రతిసారీ బెడిసికొడుతున్నాయి. ‘బీజేపీతో మనం కలుస్తాం. అందుకే, బీజేపీ విషయంలో కొంచెం ఆచి తూచి వ్యవహరించండి..’ అని టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ శ్రేణులకు ఇప్పటికే సూచించారట.

‘టీడీపీతో కలిసే ప్రసక్తే లేదు.. ఆ పార్టీని ఎండగట్టాల్సిందే..’ అని బీజేపీ నాయకత్వం, తమ శ్రేణులకు చెబుతోంది. కానీ, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. టీడీపీ – బీజేపీ మధ్య వైరం, అంతలోనే స్నేహం.. రాష్ట్ర రాజకీయాల్లో కొత్తేమీ కాదు. తాజాగా జగన్ సర్కారుని పడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేశాక, బీజేపీ అధిష్టానంతో ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు చర్చల వ్యవహారాన్ని వేగవంతం చేశారట. ఢిల్లీలో తమకున్న దూతల ద్వారా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు సంబందించి మీడియాకి లీకులు అందుతున్నాయి. ఈ ప్రయత్నాలు కొంతమేర సఫలమయినట్లు కనిపిస్తున్నప్పటికీ, ఇంకోసారి టీడీపీని నమ్మి మోసపోలేం.. అన్న భావనే బీజేపీలో వుందనే వాదన వినిపిస్తోంది. ఇరు పక్షాల రాజకీయ అవసరాల నేపథ్యంలో ఈక్వేషన్స్ ఎలాగైనా మారొచ్చు.