ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం, టోల్ ఫీజు మినహాయింపు అడిగినందుకు అమానుషంగా ప్రవర్తించిన టోల్ సిబ్బంది. నలుగురి అరెస్ట్. ఆర్మీ జవాన్‌ను స్తంభానికి కట్టేసి కొట్టిన సిబ్బంది.
మీరట్, ఉత్తరప్రదేశ్… దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించే సైనికుడిపై కొందరు అమానుషంగా ప్రవర్తించారు. టోల్ ఫీజు మినహాయింపు గురించి ప్రశ్నించినందుకే ఒక ఆర్మీ జవాన్‌ను స్తంభానికి కట్టేసి, కర్రలతో చితకబాదిన అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే… రాజ్‌పుత్ రెజిమెంట్‌లో పనిచేస్తున్న జవాన్ కపిల్ కవాడ్, సెలవుల అనంతరం తిరిగి శ్రీనగర్‌లోని తన పోస్టింగ్‌కు వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి కారులో బయలుదేరారు. అతనితో పాటు అతని కజిన్ కూడా ఉన్నారు. మార్గమధ్యలో మీరట్‌లోని భుని టోల్ బూత్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విమానం సమయం మించిపోతుందనే ఆందోళనతో కపిల్ కారు దిగి, టోల్ బూత్ సిబ్బంది వద్దకు వెళ్లారు. తన గ్రామానికి టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఉందని, దారి ఇవ్వాలని కోరారు.
ఈ విషయమై జవాన్‌కు, టోల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం మొదలైంది. అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఐదుగురు టోల్ సిబ్బంది కపిల్‌పై, అతని కజిన్‌పై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. కర్రలతో విచక్షణారహితంగా కొడుతూ, ఒక స్తంభానికి చేతులు వెనక్కి కట్టేసి తీవ్రంగా గాయపరిచారు.
రంగంలోకి దిగిన పోలీసులు… ఈ ఘటనపై కపిల్ కుటుంబ సభ్యులు సరూర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మీరట్ రూరల్ ఎస్పీ రాకేష్ కుమార్ మిశ్రా వెంటనే స్పందించి కేసు నమోదు చేయించారు. టోల్ బూత్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలను పరిశీలించి నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు.
సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఆగ్రహం…. జవాన్‌పై దాడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “దేశాన్ని కాపాడే సైనికుడికే రక్షణ లేదా?”, “ఇంతటి అమానుషమా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరిహద్దుల్లో శత్రువులతో పోరాడే సైనికుడికి స్వదేశంలో ఇలాంటి అవమానం జరగడం సిగ్గుచేటని పలువురు కామెంట్లు చేస్తున్నారు.


