జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి. అప్పుడప్పుడూ పార్టీ నుంచి ప్రెస్ నోట్లు విడుదలవుతున్నాయి.. జనసేన పార్టీకి సంబంధించి వివిధ కమిటీల ప్రకటన జరుగుతోంది. జనసేన నేతలు కొందరు మీడియా ముందుకొచ్చి హంగామా చేస్తున్నారు. మంత్రులపైనా, ఇతర వైసీపీ నేతల మీదా, ముఖ్యమంత్రి మీదా జనసేన నేతల విమర్శల సంగతి సరే సరి. అంతా బాగానే వుందిగానీ, మిత్రపక్షం జనసేన పార్టీతో కలిసి ప్రజా సమస్యలపై పోరాటం.. అన్న ఆలోచనే జనసేన పార్టీ చేయడంలేదు. బీజేపీ కూడా అదే బాటలో పయనిస్తోంది. మొదట్లో విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణపై గట్టిగా నినదించిన జనసేన అనూహ్యంగా మౌన వ్రతం షురూ చేసింది. ఏపీ బీజేపీ నేతలదీ ఇదే దారి. అమరావతి విషయంలో కూడా బీజేపీ, జనసేన పూర్తి గందరగోళంలోనే వున్నట్టున్నాయి.
2024లో అధికారంలోకి వస్తాం.. అని జనసేన, బీజేపీ ఘంటాపథంగా చెబుతున్న దరిమిలా, అసలు కనీసపాటి ప్రయత్నమైనా ఈ రెండు పార్టీలు చేస్తున్నాయా.? అన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. కాస్తలో కాస్త తెలుగుదేశం పార్టీనే నయ్యం ఈ విషయంలో. ప్రధాన ప్రతిపక్షం గనుక తన పని తాను చేసుకుపోతోంది. జనసేన – బీజేపీతో పోల్చితే వామపక్షాలూ బెటర్ అనుకోవాల్సిందే. అంతెందుకు, జనసేనతో పోల్చితే బీజేపీ చాలా చాలా బెటర్. వాస్తవానికి ఏపీలో ఇప్పుడు పొలిటికల్ వాక్యూమ్ చాలా క్లియర్‌గా కనిపిస్తోంది.. విపక్షం లెక్కల్లో. అధికార పార్టీకి ధీటుగా ఎదిగే అవకాశం జనసేన పార్టీకే వుంది. జనసేన పార్టీ లీడ్ తీసుకుని, బీజేపీతో కలిసి ప్రజా సమస్యలపై రాజకీయ పోరాటం చేయగలిగితే, బలమైన రాజకీయ పక్షంగా జనసేన నిలబడే అవకాశం వుంటుంది. కానీ, మిత్రపక్షం బీజేపీ చాలా విషయాల్లో రాష్ట్రానికి అన్యాయం చేస్తోన్న దరిమిలా, జనసేన గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. అందుకే, జనసేనా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారన్నమాట.