రాజ్యసభలో బిలియనీర్లు… తెలుగు రాష్ట్రాల్లో దిమ్మ తిరిగే లెక్కలు!

పార్లమెంటు లోని పెద్దల సభ (రాజ్యసభ)లో ఉన్న ఎంపీల ఆస్తులు, వారిపై ఉన్న కేసుల వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల రాజ్యసభ ఎంపీలు చాలా రిచ్ గురూ అని అనేలా ఉన్నాయన్నా అతిశయోక్తి కాదు. ఇందులో ఫిల్టర్ చేస్తే… రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలంగాణ ఎంపీలు మరీ రిచ్ అని తేలింది!

రాజ్యసభలోని మొత్తం 233 మంది సభ్యులకు గానూ సుమారు 225 మంది రాజ్యసభ సభ్యులపై ఉన్న నేరాలు, ఆస్తుల వివరాలతో నివేదిక తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా… రాజ్యసభ సిట్టింగ్ ఎంపీలలో దాదాపు 12 శాతం మంది బిలియనీర్లు ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ లు ఒక నివేదిక విడుదల చేశాయి.

ఈ నివేదికలో తెలుగు రాష్ట్రాల పెద్దల సభ ఎంపీలకు సంబంధించిన ఆస్తుల విలువ హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగా… ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఈ జాబితాలో 18 మంది ఎంపీలు ఉండగా.. వీరి మొత్తం ఆస్తుల విలువ రూ. 9,419 కోట్లు అని ఈ నివేదిక తెలిపింది.

రాజ్యసభ ఎంపీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న మొత్తం 11 మంది ఎంపీలలో 5గురు, తెలంగాణ నుంచి ఉన్న మొత్తం ఏడుగురు ఎంపీలలో ముగ్గురు, మహారాష్ట్రలో మొత్తం 19మందికి గానూ ముగ్గురు, ఢిల్లీ నుంచి ఉన్న ముగ్గురు ఎంపీలలో ఒక్కరు, మధ్య ప్రదేశ్ లోని 11 మంది ఎంపీలలో ఇద్దరు, పంజాబ్ లోని ఏడుగురు ఎంపీలలో ఇద్దరు, హర్యానాలోని ఐదుగురు ఎంపీలలో ఒక ఎంపీ తమ ఆస్తుల విలువ రూ. 100 కోట్లుగా ప్రకటించినట్లు నివేదిక పేర్కొంది.

ఇక ముఖ్యంగా తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏడుగురు రాజ్యసభ ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ. 5,596 కోట్లు కాగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న 11 మంది ఎంపీల ఆస్తుల విలువ రూ. 3823 కోట్లుగా ఉందని నివేదిక తెలిపింది. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్‌ కు చెందిన 30 మంది రాజ్యసభ సభ్యుల ఆస్తులు విలువ రూ.1941 కోట్లుగా ఉన్నట్లు నివేదిక తెలిపింది.

ఇదే సమయంలో నలుగురు రాజ్యసభ సిట్టింగ్‌ ఎంపీల ఆస్తులు రూ. 10 లక్షల లోపే ఉన్నాయని నివేదిక పేర్కొంది. వీరిలో ఆప్‌ కి చెందిన సంత్ బల్బీర్ సింగ్ ఆస్తుల విలువ రూ.3.79 లక్షలు, సంజయ్ సింగ్‌ కు రూ.6.6 లక్షలు, తృణమూల్ కాంగ్రెస్‌ కు చెందిన ప్రకాష్ చిక్ బరాక్‌ కు రూ.9.25 లక్షల ఆస్తులుండగా.. బీజేపీకి చెందిన మహారాజా సనాజయోబా లీషెంబా ఆస్తుల విలువ రూ.1.98 లక్షలు!

మొత్తంగా చూస్తే 225 మంది రాజ్యసభ ఎంపీల ఆస్తుల విలువ రూ. 18,210 కోట్లని ఈ నివేదిక తెలిపింది.

ఇదే సమయంలో… పెద్దల సభలో కోటీశ్వరులే కాదు.. క్రిమినల్ కేసులున్న పెద్దలు కూడా ఎక్కువగానే ఉన్నారని ఈ నివేదిక తెలిపింది. ఇందులో భాగంగా… మొత్తం 225 మంది సభ్యుల్లో 75 మంది తమపై క్రిమినల్ కేసులు ఉండగా… వీరిలో 41 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరో ఇద్దరు ఎంపీలపై హత్య కేసులు నమోదైనట్లు ఈ నివేదిక తెలిపింది.

ఇదే క్రమంలో… బీజేపీకి చెందిన 85 మంది సభ్యుల్లో 23 మందిపైనా, కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 సభ్యుల్లో 12 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తమ అఫిడవిట్‌ లో పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది. రీజనల్ పార్టీల విషయానికొస్తే… టీఎంసీకి చెందిన 13 మంది, ఆర్జేడీ నుంచి నామినేట్ అయిన ఐదుగురు, సీపీఐ నుంచి నలుగురు, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు, వైసీపీ నుంచి ముగ్గురు, ఎన్సీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నట్లు ఈ నివేదికలు వెల్లడించాయి.