యోగాగురు రామ్‌దేవ్ బాబా గురువారం హఠాత్తుగా అర్ధ కుంభమేళాలో కనిపించారు. అఘోరీ, నాగసాధువులు బస చేసిన టెంట్లకు వెళ్లి, వారితో ముచ్చట్లు పెట్టుకున్నారు. పనిలో పనిగా- అఘోరీలు, నాగా సాధువులకు కూడా జ్ఞానబోధ చేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ప్రవచనాలు వారిక్కూడా బోర్ కొట్టే ఉంటాయి.
అఘోరీలు, నాగా సాధువులు ఎప్పుడూ గంజాయి దమ్ము బిగించి కొడుతుంటారు.
స్మోకింగ్ చేయకపోతే సాధారణ సన్యాసులకు కూడా పొద్దు పోదు. ఇది వారి అలవాటు కావచ్చు, బలహీనత అనీ అనుకోవచ్చు. ఈ పాయింట్ మీదే రామ్‌దేవ్ బాబా చెలరేగిపోయారు. పొగ తాగవద్దంటూ క్లాస్ పీకారు. ఏకంగా ఆయన శ్రీరాముడు, శ్రీకృష్ణుడినీ ముగ్గులోకి లాగారు.
`శ్రీరాముడు, శ్రీకృష్ణుడిని మనం ఆరాధిస్తాం. దేవుళ్లుగా పూజిస్తాం. వారు ఏనాడూ పొగ తాగలేదు. మానవ మాత్రులమైన మనం ఎందుకు పొగ తాగుతున్నాం. ఈ అలవాటును మానుకోరూ!` అని ఆయన హితబోధ చేశారు. `మనమంతా సాధువులం. మనకు ఇష్టమైన వాటిని ఇంట్లోనే వదిలి పెట్టి, సన్యాసం స్వీకరించాం. ఓ గోప్ప కార్యం కోసం తల్లిదండ్రులను కూడా త్యజించాం. అలాంటిది పొగ తాగడాన్ని కూడా వదిలేయలేమా?..` అని వారితో డిబేట్ పెట్టారు.
అక్కడితో ఆగారా? లేదే! సాధువుల వద్ద ఉండే చిలుం (గంజాయి పీల్చడానికి వినియోగించే ఓ రకమైన గొట్టం)లను సేకరించారు. వాటన్నింటినీ కుప్పగా పేర్చారు. తాను గనక భవిష్యత్తులో మ్యూజియాన్ని పెట్టదలిస్తే.. ఈ చిలుంలన్నింటినీ తీసుకెళ్లి, అందులో ప్రదర్శనకు ఉంచుతాననీ ఓ నవ్వు రాని జోక్ వేశారు. తాను ఎందరో ఈ తరం యువకులను పొగ తాగడాన్ని మాన్పించానని, ఈ సాధువులతోనూ మాన్పిస్తాననీ ధీమా చెప్పారాయన.