ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి విడుదలవుతున్న వీడియోలు అక్కడున్న భయానక వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ లోకి ప్రవేశించిన వందలాది మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చేందుకు ఇజ్రాయెల్ సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. మరోపక్క ఇజ్రాయేల్ లో చిక్కుకున్న విదేశీయుల అంశం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
అవును… ఇజ్రాయేల్ లో భయానక పరిస్థితులు సృష్టిస్తోన్న హమాస్ మిలిటెంట్లు ఆ దేశ ప్రజలతో పాటు విదేశీయుల్నీ సైతం వదలడం లేదు. అందులో భాగంగా విదేశీయులను సైతం బంధించి చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఆ చిత్రహింసలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఈ సమయంలో భారత్ రాజ్యసభ ఎంపీ వాన్ వేయ్ రాయ్ ఖార్లుఖీ ఇజ్రాయెల్ లో చిక్కుకున్నారని తెలుస్తుంది. మేఘాలయ నుంచి నేషనల్ పీపుల్స్ పార్టీ తరుపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖార్లుఖీ… కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలెం వెళ్లారు. ఈ సమయంలో ఎవరూ ఊహించని విధంగా యుద్ధం ప్రారంభమవడంతో ఆయన బెత్లహేం లో చిక్కుకుపోయారని సమాచారం.
ఈ సమయంలో బెత్లహేం లో ఉన్న రాజ్యసభ ఎంపీతోపాటు వారి కుటుంబ సభ్యుల గురించి మేఘాలయ సీఎం కార్నాడ్ సంగ్మా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా… ఇజ్రాయెల్ లోని భారత్ దౌత్యకార్యాలయంతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. ప్రస్తుతానికి ఆయన క్షేమంగా ఉన్నారని సమాచారం.
ప్రస్తుతం ఇజ్రాయెల్ లో థాయిలాండ్ కు చెందిన దాదాపు 5,000 మంది ప్రజలు ఉన్నారు. వీళ్లంతా అక్కడ వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఈ సమయంలో 11 మందిని హమాస్ మిలిటెంట్లు బంధించినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇదే సమయంలో శనివారం జరిగిన దాడుల్లో ఇద్దరు థాయిలాండ్ దేశీయులు ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు.
ఇదే సమయంలో ఇజ్రాయెల్ లో ఉంటున్న తమపౌరులు కొంతమంది ఆచూకీ గురించి బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేసింది. అదేవిధంగా… ఇజ్రాయెల్ వెళ్లిన నేపాల్ విద్యార్థుల భవిష్యత్ కూడా ఆందోళనకరంగా మారిందని తెలుస్తుంది. ఈ క్రమంలో… సుమారు 17 మంది నేపాల్ విద్యార్థులను హమాస్ మిలిటెంట్లు బందీలుగా పట్టుకున్నట్లు నేపాల్ రాయబారి వెల్లడించారు.
మరోపక్క సుమారు 18 వేల మందికి పైగా భారతీయులు ఇజ్రాయెల్ లో ఉంటుండగా.. వారిలో ఎక్కువ మంది ఇళ్లల్లో కేర్ టెకర్ లుగా పని చేస్తుండగా.. ఉన్నత విద్య కోసం వెళ్లిన వారు కూడా ఉన్నారు. ఈ సమయంలో అక్కడున్న భారతీయులు అంతా అప్రమత్తంగా ఉండాలని రాయబార కార్యాలయం కోరుతుంది!