ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ ఇటీవలే వివాహం చేసుకున్నారు. హనీమూన్ సందర్భంగా మేఘాలయకు వెళ్లిన ఈ దంపతుల జీవితం అక్కడే ముగియడం అందరిని కలచివేసింది. మే 23న రాజా మృతదేహం లభ్యమవగా, సోనమ్ అదృశ్యమైంది. ఇదంతా మిస్సింగ్ కేసు అనుకుంటున్న సమయంలో ఆమె అనూహ్యంగా పోలీసులకు లొంగిపోయింది. విచారణలో రాజాను తానే చంపించానని ఒప్పుకోవడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు.
పోలీసుల దర్యాప్తులో అసలు కుట్ర బయటపడింది. వివాహానికి ముందు ఓ వ్యక్తితో సంబంధం కలిగి ఉన్న సోనమ్, భర్తను అడ్డుగా భావించి, హత్యకు కుట్ర పన్నింది. తన ప్రణయ సంబంధాన్ని నిలబెట్టుకోవడానికే రాజా అడ్డంకిగా ఉన్నాడని నమ్మిన ఆమె, కిరాయి హంతకులను నియమించింది. మేఘాలయకు వెళ్లిన తర్వాతే వారు ఈ పన్నాగాన్ని అమలు చేశారు.
ఈ కేసులో ఇప్పటివరకు నాలుగురిని అరెస్ట్ చేశారు. సోనమ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో అదుపులోకి తీసుకోగా, హత్యలో పాల్గొన్న ముగ్గురు కిరాయి గుండాలను ఇండోర్‌లో అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. హత్యకు ప్రణాళిక, ప్రయాణ వివరాలు, కమ్యూనికేషన్ డేటాను పరిశీలిస్తున్నారు.
నవదంపతులుగా జీవితం ప్రారంభించిన దంపతుల్లో భార్యే ఇలా హంతకురాలిగా మారడం ఇండోర్‌తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పెళ్లికి ముందు సంబంధాలు, మోసపూరిత ప్రవర్తన… ఇలా అనేక కోణాల్లో విచారణ జరుగుతోంది. ఈ సంఘటన, నమ్మకాన్ని ఛిద్రం చేసే విధంగా ఉండటమే కాదు… నైతిక విలువలపై ప్రశ్నలు వేస్తోంది. ఒక పుణ్య ఘట్టం కావాల్సిన హనీమూన్, హత్యకు వేదిక కావడం సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.