పుట్టగానే రాహుల్ ని మొదట ముద్దాడిందెవరో తెలుసా? : వయనాడ్ నర్సమ్మ జ్ఞాపకాలు

రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేధీ లోక్ సభ నియోజకవర్గంలో మే 6న పోలింగ్ జరగబోతున్నది.

ఈ నేపథ్యంలో ఒక ఆసక్తి కరమయిన చర్చ జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ భారతీయుడా, బ్రిటిష్ పౌరుడా అనేది ఆ చర్చ. ఇదెందుకు మొదలయిందంటే, 2003 లో యుకె బ్యాకాప్ అనే కంపెనీని రాహుల్ గాంధీ రిజిస్టర్ చేసుకున్నారని, అక్కడ సమర్పించిన వివరాల ప్రకారం ఆయన తనను బ్రిటిష్ పౌరుడిగా చెప్పుకున్నారని చెబుతూ బిజెపి రాజ్యసభ సభ్యడు డా సుబ్రమణ్య స్వామి కేంద్ర హోం శాఖకు ఒక వినతిప్రతం పంపి దీని సంగతి తెల్చండని అడిగారు. దీనిమీద కేంద్రహోంశాఖ రాహుల్ గాంధీకి నోటీ సు పంపి 15 రోజులలో నిజమేదో చెప్పాలని అడిగింది.


రాహుల్ పౌరసత్వం గురించిన చర్చ పాతదే. దీని మీద సిబిఐ ఎంక్వయిరీ జరపాలని ఒక వ్యక్తి 2015లో సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. దానిని కోర్టు కొట్టి వేసింది. ఇదొక సారి పార్లమెంటు ఎధిక్స్ కమిటీ ముందుకు కూడా వచ్చింది. దానికి,  తానెపుడూ బ్రిటిష్ పౌరసత్వంతీసుకోలేదని, దానికోసం అభ్యర్థించలేదని, తాను భారతీయుడినని వివరణ ఇవ్వడంతో చెప్పడం తోవివాదం ముగిసింది. రాజకీయాల్లో ముగింపులుండవుగా. మళ్లీ మళ్లీ పాత విషయాలే వేరే వేరే రూపాల్లో వివాదాలు సృష్టిస్తుంటాయి. రాహుల్ బ్రిటిష్ పౌరసత్వం గొడవ ఇలాంటిదే.

ఈ వివాదం ఢిల్లీలో, మీడియాలో వేడివేడిగా కాగుతున్నపుడు కేరళ వయనాడ్ నుంచి ఒక అసక్తికరమయిన కథనం వచ్చింది.

72 సంవత్సరాల రాజమ్మ వావతిల్  రాహుల్ గాంధీ జూన్ 17,1970 న పుట్టినపుడు ఆసుప్రతిలో ఏంజరిగిందో వివరంగా చెప్పి ఒక సంచలనం సృష్టించారు. నర్సుగా చాలా కాలం పనిచేసి రిటైరయిన రాజమ్మ ఇపుడు రాహుల్ పోటీచేసిన వయనాడ్ లో స్థిరపడింది. రాహుల్ను ప్రచారంలో చూశాక ఆమె పాత విషయాలను నెమరేసుకుంది. అది వైరలయింది.

న్యూఢిల్లీలోని హోలీ ఫామిలీ హాస్పిటల్ లో రాజమ్మ ఆరోజుల్లో నర్స్ గా పని చేస్తూ ఉండింది. ఆరోజు సోనియా గాంధీ ప్రసవానికి వచ్చారు. ప్రధాని ఇందిరాగాంధీ కోడలు ఆసుపత్రిలో ఉన్నారన్న హడావిడి ఏ మాత్రం లేదని ఆమె చెప్పారు.

లేబర్ రూమ్ టీమ్ లో రాజమ్మ కూడా ఉంది. అక్కడున్న మేమంతా ఎంతో గర్వంగా ప్రధాని మనవడిని పొత్తిళ్ల నుంచి ఎత్తి పట్టుకున్నామని ఆమె చెప్పారు. తామంతా ఎంత భావో ద్వేగానికి లోనయ్యామో చెప్పాల్సిన పని లేదని రాజమ్మ అన్నారు.

హోలీ ఫామిలీ హస్పిటల్ అనేది ఢిల్లీ వివిఐపిల కుటుంబాల ఆసుపత్రి. ముఖ్యంగా దౌత్యాధికారుల కుటుంబాలు సందర్శించే ఆసుపత్రి.

లేబర్ రూంలో ప్రధాని కోడులున్నారంటే ఎంత ప్రాముఖ్యం ఉంటుందో వేరే చెప్పాలా?  అయితే, సోనియా తన హోదాతో ఎపుడూ హంగామా సృష్టించలేదక్కడ అని రాజమ్మ చెప్పారు.

సోనియా గాంధీ తో పాటు ప్రధాని కుటుంబం మొత్తం ఆసుపత్రి సిబ్బందికి చాలా సహకారం అందించేవారు. సోదరుడు సంజయ్ గాంధీతో కలసి రాజీవ్ గాంధీ వెయిటింగ్ రూంలోనే కూర్చున్నారు.

సోనియాతో మాట్లాడేందుకు  వాళ్లని లేబర్ లోకి అనుమతించినా వారిద్దరు వెయిటింగ్ రూంలోనే ఉండిపోయారు.

‘లోన సోనియా కూడా చాలా సింపుల్ గా ఉండే వారు. ఆమె ఎంత కోఆపరేటివ్ గా ఉండే వారంటే, అక్కడ చూస్తున్నది దేశ ప్రధాని కోడలు అని మేం ఎపుడూ వత్తిడికి లోను కాలేదు. అంతేకాదు, చివరకు ప్రధాని కూడా తన విజిట్స్ తో ఆసుపత్రిలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసే వారు,’ అని రాజమ్మ చెప్పారు. రాహుల్ గాంధీ పుట్టిన రెండురోజుల తర్వాత ఇందిరా గాంధీ ఆసుపత్రికి వచ్చారు.

“నాకు తెలిసినంతవరకు ఆ రోజు జూన్ 17,1970. పుట్టినపుడు రాహుల్ చాలా ముద్దుగా ఉండేవాడు. పురుడు పోసిన వాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు చేతుల్లోకి తీసుకుని ముద్దాడాం, మరి ఆయన ప్రధాన మంత్రి మనవడు కదా. రాహుల్ తల్లి తండ్రులకంటే ముందు చేత్తుల్లోకి తీసుకుని ముద్దాడిందిమేమే,’అని గర్వంగా గతం గుర్తు చేసుకుంది.

ప్రధాని కోడలయినా సెక్యూరిటి సమస్యలు రాలేదు, సోనియాది నార్మల్ డెలివరీ అని రాజమ్మ చెప్పింది.
ఆ మరుసటి సంవత్సరమే రాజమ్మ ఆసుపత్రిని వదిలేయాల్సివచ్చింది. ఎందుకంటే ఆమె సైనికుడిని పెళ్లి చేసుకున్నారు. తాను సైనికాసుపత్రిలో చేరారు. లెఫ్టినెంట్ దాకా ఎదిగారు. 1987లో స్వచ్ఛంద పదవీవిరమణ తీసుకున్నారు. ఇపుడ వయనాడ్ సమీపంలోని కల్లూరులో నివసిస్తున్నారు.

రాహుల్ ని తన మనవడని పిలస్తుంది. రాహుల్ నామినేషన్ వేసేందుకు వచ్చినపుడు , ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చినపుడే వెళ్ల లేకపోయింది. రాహుల్ ను చూల్లేక పోయింది. రాహుల్ మళ్లీ వచ్చినపుడు తనకెవరూ సాయం చేయకపోయినా కలుస్తానని ధీమాగా చెబుతున్నది.

‘ ప్రధాని ఇందిరాగాంధీ కుటుంబ సభ్యలకంటే ముందు రాహుల్ ను చేతుల్లో ఎత్తుకున్నది నేనే. రాహుల్ పుట్టినపుడు ఆసుప్రతిలో ఎంత సంబరం ఉండిందో చెప్పాలనుకుంటున్నాను,’ అని రాజమ్మ ఆశపడుతూ ఉంది. అయితే, దీన్తో పాటే వయనాడ్ కు సరైన వైద్యసదుపాయం లేదు, ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కావాలి. ఎందుకంటే ఎదైన ఎమర్జన్సీ వస్తే 80 కి.మీ దూరాన ఉన్న కోళికోడ్ కు వెళ్లాల్సి వస్తున్నది. ఈ విషయం కూడా రాహుల్ కు చెబుతాను,’ అని రాజమ్మ మీడియా వాళ్ల తోచెప్పింది.