రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందించేందుకు ఏఐసిసి అధ్యక్షుడు రాహూల్ గాంధి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం కర్నూలులో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. చాలా కాలం తర్వాత రాహూల్ రాష్ట్ర పర్యటనకు వస్తుండటం గమనార్హం. 2014 రాష్ట్ర విభజన నేపధ్యంలో జనాలు రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఘోరి కట్టేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అందుకనే పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చాలా చోట్ల కనీసం డిపాజిట్ కూడా దక్కనీయలేదు జనాలు.
అప్పటికి ఇప్పటికీ పార్టీ పరిస్దితిలో పెద్ద తేడా అయితే కనబడటం లేదు. ఆమధ్య నంద్యాల అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కు వందల సంఖ్యలో మాత్రం ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్క డివిజన్ కూడా దక్కలేదు. అంటే జనాల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకా ఎంతమంటుందో అర్ధమైపోతోంది.
అటువంటిది వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఊపిరిలూదాలని రాహూల్ ప్రయత్నిస్తున్నట్లున్నారు. అందుకనే వ్యూహాత్మకంగా కర్నూలులో బహిరంగసభ నిర్వహిస్తున్నారు. బహిరంగసభకు కర్నూలునే వేదికగా ఎంచుకోవటంలో ముందు జాగ్రత్త ఉందని సమాచారం. ఎలాగంటే, జిల్లాలో కావచ్చు లేదా పక్క జిల్లాల నుండి కావచ్చు ఒకవేళ జనాలు రాకపోతే పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్రం నుండి జనాలను తెప్పించవచ్చన్నది స్ధానిక నేతల ఆలోచనగా తెలుస్తోంది.
అనంతపురమైనా కర్నూలు జిల్లా అయినా కర్నాటక రాష్ట్రానికి సరిహద్దు జిల్లాలన్న సంగతి అందిరికీ తెలిసిందే. ఎటూ కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కారణంగా సరిహద్దు ప్రాంతాల నుండి ముందుజాగ్రత్తగా జనాలను తెప్పిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.(kpk)