పార్లమెంటులో రాహుల్ గాంధీ రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను టార్గెట్ చేశారు. రాహుల్ ప్రసంగంలో అభ్యంతరాలున్నాయంటూ నిర్మలాసీతారామన్ పదేపదే అడ్డు తెలిపారు. ఆ తర్వాత రక్షణ వ్యవహారాల విషయాలపై రాహుల్ సభలో ప్రస్తావించారు. రఫెల్ విమానాల కొనుగోలు విషయంలో నిర్మల సీతారామన్ దేశాన్ని తప్పుదోవ పట్టించారన్నారు. రఫెల్ ఒప్పందాన్ని రహస్యంగా చేసుకోవడమేనుక అంతర్యమేంటని రాహుల్ నిలదీశారు. ఫ్రాన్స్ ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఒప్పందం చేసుకున్నారని ఈ విషయాన్ని ఆ దేశాధ్యక్షుడే నాకు స్వయంగా చెప్పారని రాహుల్ తెలిపారు. చైనా సరిహద్దులో సైనికులు ఢోక్లాం గురించి పోరాడుతుంటే చైనా అధ్యక్షునితో భేటి సంధర్భంగా ఢోక్లాం సమస్య గురించి ఎందుకు ప్రస్తావించలేదని రాహుల్ ప్రధానిని ఎండగట్టారు. మన సైనికులు చైనాతో పోరాడుతుంటే ప్రధాని చైనా అధ్యక్షునితో పడవలో ఎలా ప్రయాణిస్తారని, మోదీ ఈ విధంగా వ్యవహరించి సైనికులను అవమానపరచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణ శాఖలో జరుగుతున్న అవినీతితో దేశానికి ముప్పు ఉందన్నారు.