కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మోడీని విమర్శించినందుకు దాఖలైన పరువు నష్టం పిటిషన్ పై విచారణ జరిపిన సూరత్ కోర్టు.. ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పు సమయంలో కోర్టుకు రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు.
2019లో కర్నాటకలోని కోలార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. “దేశంలోని దొంగలందరి ఇంటి పేర్లు మోడీ అనే ఎందుకు ఉంటాయంటూ” కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ. నిరవ్ మోడీ, లలిత్ మోడీలతో పాటు ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి మాట్లాడుతూ… ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీ నేతలకు కోపం తెప్పించింది. దీంతో… రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేశ్ మోడీ కేసు పెట్టారు.
నీరవ్ మోడీ, లలిత్ మోడీ లేదా నరేంద్ర మోడీ వంటి దొంగలందరి పేర్లలో మోడీ ఎందుకు ఉన్నారు” అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారని.. ఇది తమ మనోభావాలను దెబ్బ తీసిందని పూర్ణేశ్ మోడీ కోర్టుకు వెళ్లారు. దీనిపై సూరత్ కోర్టు విచారణ జరిపింది. భారత శిక్షాస్మృతి సెక్షన్లు 499, 500 కింద దాఖలు చేసిన కేసులో రాహుల్ కోర్టుకు కూడా పలుమార్లు హాజరయ్యారు. 2021 అక్టోబర్ లో తన వాంగ్మూలాన్ని ఇచ్చారు.
ఇందులో భాగంగా రెండేళ్ల విచారణ తర్వాత.. వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే 2023, మార్చి 23న సూరత్ కోర్టుకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. ప్రధాని మోడీ ప్రతిష్టకు భంగం కలిగించారని, సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయని నిర్థారించిన కోర్టు.. రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
అయితే ఈ విషయంలో స్పందించిన కాంగ్రెస్ పార్టీ…. మోడీ ఇంటిపేరు ఉన్న వారందర్నీ రాహుల్ కించపర్చలేదని ఇప్పటికే స్పష్టం చేసింది. మోడీ ఇంటి పేర్లు ఉండి పరారీలో ఉన్న నిరవ్ మోడీ, లలిత్ మోడీల గురించే రాహుల్ ప్రస్తావించారని, ప్రధాని మోడీపై రాజకీయ విమర్శలు చేశారని చెప్పుకొచ్చారు. అయితే కోర్టు మాత్రం అలా భావించలేదు. ఫలితంగా… రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
తీర్పు అనంతరం ట్విట్టర్ లో స్పందించిన రాహుల్ గాంధీ… “తన మతమనేది సత్యం, అహింసపై ఆధారపడిందది, సత్యమే తన దేవుడు, అహింసే దానిని పొందే సాధనం” అనే మహాత్మా గాంధీ కోట్ ను ట్వీట్ చేశారు.
ఇక తీర్పు అనంతరం స్పందించిన న్యాయవాదులు… “రాహుల్ గాంధీకి 499, 500 ఐపీసీ కింద రెండేళ్ల జైలు శిక్ష పడింది.. ఆ శిక్షకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ అప్పీల్ మేరకు కోర్టు అతనికి 30 రోజుల బెయిల్ ను మంజూరు చేసింది.. అప్పటి వరకు ఈ శిక్షను కోర్టు తాత్కాలికంగా నిలిపివేయనుంది” అని స్పష్టం చేశారు!