రాహుల్ గాంధీపై అనర్హత వేటు.! ఇదో పెను సంచలనం.!

చచ్చిపోతోందనుకుంటోన్న కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసే పని పెట్టుకున్నట్టుంది బీజేపీ.! కొన్నాళ్ళ క్రితం.. ‘మోదీ’ పేరుపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరు ఎందుకు వుంటుంది.?’ అని ప్రశ్నించారాయన. నీరవ్ మోదీ అవినీతిపై స్పందిస్తూ, ప్రధాని మోదీని లింక్ చేస్తూ రాహుల్ చేసిన రాజకీయ విమర్శ అది.

బీజేపీకి చెందిన ఓ శాసనసభ్యుడు కోర్టును ఆశ్రయించడంతో, ఇటీవలే రాహుల్ గాంధీ ఈ కేసులో దోషిగా తేలారు, రెండేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఇంతలోనే, లోక్ సభ సెక్రెటేరియట్, రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది. దాంతో, దేశ వ్యాప్తంగా ఇదో సంచలనమై కూర్చుంది.  ఇకపై, రాజకీయాల్లో ఎవరైనా విమర్శ చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిందే. ఆరోపణలకు సంబంధించి దోషులుగా తేలితే, ప్రజా ప్రతినిథులపై అనర్హత వేటు పడుతుందన్నమాట. అయితే, ఇది కేవలం అధికార పార్టీపై విమర్శలు చేసేవారికే వర్తిస్తుందేమో.!

ఎందుకంటే, గాంధీ కుటుంబంపై బీజేపీ నేతలు చేసిన తీవ్రాతి తీవ్రమైన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఆ లెక్కన, బీజేపీలో ఒక్కరంటే ఒక్క ప్రజా ప్రతినిథి కూడా వుండకూడదిప్పుడు. అయితే, రాజకీయాల్లో మార్పు అవసరం. జుగుప్సాకరమైన విమర్శలు లేని రాజకీయం కావాలంటే, మార్పు ఎక్కడో ఓ చోట మొదలవ్వాలి.

రాహుల్ గాంధీపై అనర్హతతో మార్పు మొదలైందనే అనుకుందాం. దేశవ్యాప్తంగా, ప్రజా ప్రతినిథులు చేస్తున్న, చేసిన విమర్శల లెక్కలు తీయాలి. ఆయా కేసుల్లో విచారణ వేగంగా పూర్తవ్వాలి. దోషులెవరో తేలాలి. అనర్హత వేటూ పడాలి. కానీ, అది జరుగుతుందా.? రాహుల్‌పై అనర్హత వేటు, కాంగ్రెస్ పార్టీకి ఊతమిస్తుందనడం నిస్సందేహం. సింపతీ ఖచ్చితంగా వర్కవుట్ అవుతుంది. బీజేపీ రాజకీయంగా తన చావుని తానే కొనితెచ్చుకున్నట్లయ్యింది.