ఫైనల్లీ భారతీయులు ఆసక్తిగా వేచి చూస్తున్న రాఫెల్ యుద్ద విమానాలు ఇండియాలో ల్యాండ్ అయ్యాయి. ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు ఇవాళ హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరంలో దిగాయి. సుమారు 7,300 కిలోమీటర్ల దూరం ప్రయామించి ఈ విమానాలు భారత్ చేరుకున్నాయి. సోమవారం ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన రాఫెల్ విమానాలు దాదాపు ఏడు గంటల ప్రయాణం తర్వాత తొలుత యూఏఈలోని ఓ ఫ్రాన్స్ వైమానిక స్థావరంలో దిగాయి. నిన్న 30 వేల అడుగుల ఎత్తులో ఫ్రాన్స్ ట్యాంకర్ నుంచి రాఫెల్ విమానాలు గాల్లోనే ఇంధనం నింపుకున్నాయి.
ప్రాన్స్ ఫ్రాన్స్‌కి చెందిన దసాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి మొత్తం 36 రాఫెల్ విమానాలను కొనుగోలు చేసుకోవడానికి భారత్ ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ మొత్తం 59,000 కోట్ల రూపాయలు. ఇప్పటికే ఒక రాఫెల్ ఇండియాకు చేరగా ఈరోజు 5 విమానాలు దిగుమతి అయ్యాయి. ఈ విమానాలను నడిపేందుకు భారత వాయుసేనలోని 12 మంది పైలెట్లకు ఫ్రాన్స్ నందు శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ పొందినవారే విమానాలను ఇండియాకు తీసుకొచ్చారు. ఐదింటిలో మూడు సింగిల్ సీటర్ జెట్ ఫైటర్లు, రెండు ట్విస్ సీటర్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి.
ఈ విమానాల్లో బోలెడన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ విమానాలు నిర్విరామంగా 3700 కిలోమీటర్లు ప్రయాణించగలవు. గంటకు 1389 కి.మీ వేగంతో ఇవి దూసుకెళ్లగలవు. ఒకేసారి ఉపరితలం నుంచి ఉపరితలానికి, గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఇవి ప్రయోగించగలవు. ఈ విమానాల నుండి అణ్వాయుధాలను కూడా ప్రయోగించే వీలుంది. 300 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే స్కాల్ప్ మిసైల్స్ ను ఈ విమానం ప్రయోగించగలదు. ఈ విమానాల చేరికతో భారత వాయుసేన బలం మరింత బలపడింది. చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి ఈ విమానాలను ప్రాన్స్ నుండి ఆలస్యం కాకుండా తీసుకురావడం విశేషం.