మరిదిని పెళ్లి చేసుకోవాలని పుల్వామా అమర జవాను భార్యకు వేధింపులు

పుల్వామా దాడిలో భర్తను కోల్పోయిన అమరజవాను భార్యకు అత్తగారింట్లో కష్టాలు మొదలయ్యాయి. కర్నాటకలోని మాండ్యకు చెందిన జవాన్ హెచ్ గురు పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరుడయ్యారు. దాంతో ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది. ఆర్మీ నుంచి రావాల్సిన నగదుతో పాటు కర్నాటక ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా, ఇల్లు, గురు భార్య కళావతికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది.

 

దీంతో ఇవన్నీ కళావతికి చెందుతాయని భావించిన అత్తామామ కొత్త నాటకానికి తెరదీసి ఆమెను వేధించారు. గురు తమ్ముడుని పెళ్లి చేసుకొని తమతోనే ఉండిపోవాలని ఆమె పై ఒత్తిడి తెచ్చారు. దీంతో గత కొన్ని రోజులుగా వేధిస్తుండడంతో వేధింపులకు తాళలేక కళావతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదిలా ఉండగా కళావతికి తక్షణమే ఉద్యోగం కల్పించాలని సీఎం కుమార స్వామి అధికారులను ఆదేశించారు. అమర జవాను భార్యకు అత్తింట్లో వేధింపులు ఎదురుకావడంతో అంతా విచారం వ్యక్తం చేశారు. అండగా నిలవాల్సిన వారు మూర్ఖంగా ప్రవర్తించడంతో అంతా వారిని విమర్శిస్తున్నారు.