ఏమ్ డ్రామాలేస్తున్నవా; సుమలత మీద నోరు జారిన మంత్రి రేవణ్ణ

నటి సుమలత మీద మాజీ ప్రధాని దేవేగౌడ పెద్ద కుమారుడు  రేవణ్ణ రెచ్చిపోయారు అంతర్జాతీయ మహిళా దినంరోజునే ఆయన సుమలత రాజకీయ ప్రవేశం గురించి దురుసుగా వ్యాఖ్యానించడం కర్నాటకలో కలకలం రేపు తూ ఉంది. అదే సమయంలో ఆయన నోరు జారడం సుమలతకు సానుభూతి పెంచి,జెడి ఎస్ అభ్యర్థికి హాని చేస్తుందేమోనన్న ఆందోళన పార్టీలో మొదలయింది.

అసలేం జరిగింది

కాంగ్రెస్ మాజీ మంత్రి, ఇటీవల మరణించిన అంబరీష్ భార్య అయిన నటి సుమలత  భర్త గతంలో ప్రాతినిధ్యం వహించిన మాండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి  కాంగ్రెస్ సీటు ఆశిస్తున్నారు. అయితే, మాండ్యలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జెడిఎస్ విజయఢంకా మోగించడంతో ఆ సీటును జెడిఎస్ కు కేటాయించింది కాంగ్రెస్. అయితే, తాను అంబరీష్ వారసత్వం కొనసాగించాలనుకుంటున్నానని, అంబరీష్ అభిమానులు, స్థానిక కాంగ్రెస్ నేతలు తనని మాండ్య నుంచే పోటీ చేయాలని కోరుతున్నారని చెబుతూ ఆమె మాండ్య టికెట్ కోసం వత్తిడి తెస్తున్నారు. ఇపుడు  సుమలతకు మాండ్య సీటు కేటాయించడం సాధ్యం కాదని, అది జెడిఎస్ సొత్తు అని కాంగ్రెస్ ప్రకటించింది. దీనితో ఆమె ఇండిపెండెంటుగా పోటీ చేస్తున్నారని ప్రచారం అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో సుమలతకు, ముఖ్యమంత్రి కుమార స్వామికి మధ్య గ్యాప్ వచ్చింది. మాండ్యనుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేయబోతున్నారు. సాధ్యమయినంతవరకు సుమలతతో సఖ్యంగా ఉండాలని కుమారస్వామి ప్రయత్నం. ఎందుకంటే, మాండ్యలో అంబరీష్ కు విపరీతమయిన ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది. ఇలాంటపుడు రేవణ్ణ నిన్న సుమలత మీద నోరుజారారు. కర్నాటక ప్రభుత్వం లో ఆయన పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రికూడా.

భర్త చనిపోయి రెండుమూడు నెలలు కూడా కాలేదు, అపుడే సుమలత రాజకీయాల్లోకి ఎలా రావాలనుకుంటున్నదని  రేవణ్ణ ప్రశ్నించారు.

ఢిల్లీ టెలివిజన్ చానెలొకదానికి ఇంటర్వ్యూ ఇస్తూ రేవణ్ణ ఈ వివాదాస్పద వ్యాఖ్య  చేశారు. ఈ వ్యాఖ్య తీవ్రవివాదానికి దారితీసింది. అయినా సరే ‘నేను క్షమాపణ చెప్పను’ అని ఆయన భీష్మించుకున్నారు.అ అంతేకాదు, మరొక వివాదాస్పద వ్యాఖ్య చేసి అగ్నికి ఆజ్యం పోశారు. ‘ ఆమె ఇంతకు ముందు తెరమీద డ్రామాలేసింది.ఇపుడు అవే నాటకాలను రాజకీయాల్లో కూడా వేయాలనుకుంటున్నది,’ అని అన్నారు.  సుమలత కుమారస్వామి మీద ఆమె కొంచెం కూడా కృతజ్ఞత లేదని, అంబరీష్ చనిపోయినపుడు కుమార స్వామి చేసిన సహాయాన్ని ఆమెమర్చిపోయాారని అన్నారు.

సుమలతకు పెరుగుతున్న సానుభూతి

దీని మీద సుమలత కూడా అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఇది రేవణ్ణ కల్చర్ ఎలాంటిదో చెబుతుందని, అయితే, ఇలాంటి మాటలతో నన్న బెదరగొట్ట లేరని ఆమె జవాబిచ్చారు. అయితే, దేవేగౌడ్ మీద తనకు చాలా గౌరవముందని, అది చెక్కుచెదరదని ఆమె చెప్పారు.

రేవణ్ణ వ్యాఖ్యలను స్వయాన ముఖ్యమంత్రికుమార స్వామిని కూడా ఇరుకున బెటాయి. వెంటనే ఆయన పార్టీకి సలహా ఇస్తూ ఎవరూ వ్యక్తిగత దాడులకు పూనుకోవద్దని చెప్పారు. ప్రతిపక్ష బిజెపి వెంటనే  స్పందిస్తూ రేవణ్ణ సుమలతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

రాష్ట్ర జెడి ఎస్ అధ్యక్షుడు  ఎహెచ్ విశ్వనాథ్ కూడా రేవణ్ణ వ్యాఖ్యాల మీద ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జెడిఎస్ మిత్ర పక్షమయినా, కాంగ్రెస్ కూడా రేవణ్ఱ చేసిన వ్యాఖ్యల పట్ల అసమ్మతి వ్యక్తం చేసింది.

మాండ్యలో కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఈజీగా గెలుస్తాడని అనుకుంటున్నప్పుడు రేవణ్ణ చేసిన వ్యాఖ్యల వల్ల సుమలత మీద సానుభూతి పెరుగుతుందని, ఆమె ఇండిపెండెంటుగా పోటీ చేస్తే ఎక్కువ వోట్లు పడి నిఖిల్ కు హాని చేస్తుందనే ఆందోళన జెడి ఎస్ లో కనపడుతుంది. ఇపుడు డామేజ్ కంట్రోల చర్యలు తీసుకోవాలనుకుంటుూ ఉంది.