ప్రియాంకా గాంధీ వాద్రా. కాంగ్రెస్ ఇప్పటిదాకా దాచి పెట్టుకున్న చిట్టచివరి అస్త్రం. సోనియాగాంధీ, రాహుల్ గాంధీల ఛరిష్మా పార్టీని ఒడ్డున పడేయలేని సందర్భంలో ప్రియాంకా గాంధీని రాజకీయాల్లోకి తీసుకుని వస్తారనే విషయం ప్రజలకు తెలుసు. ఇప్పుడదే చోటు చేసుకుంది. మరో మూడు నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రియాంకాగాంధీ అనే అస్త్రాన్ని బయటికి తీసింది కాంగ్రెస్ అధిష్ఠానం.
నరేంద్రమోడీని ఢీ కొట్టగల సత్తా ఇక ప్రియాంకా గాంధీకి మాత్రమే ఉందని ఆమె తల్లి, సోదరుడు ఫిక్స్ అయిపోయినట్టే. ఉత్తర్‌ప్రదేశ్ తూర్పు ప్రాంత ఇన్‌ఛార్జిగా ఆమెను నియమించారు. ప్రియాంకా గాంధీకి ఏ స్థాయిలో ఛరిష్మా ఉందనే విషయం.. కొన్ని గంటల్లోనే తెలిసిపోయింది. ఇన్‌ఛార్జిగా నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే.. ప్రియాంకా గాంధీ పేరు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అయింది. టాప్ ప్లేస్ నిలిచింది.
ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారన్న సమాచారం ప్రపంచంలోనే టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. హ్యాష్‌ట్యాగ్ జతచేసి ప్రియాంకాగాంధీ అనే పేరు బుధవారం మధ్యాహ్నానికి టాప్ వన్‌లో నిలిచింది. ప్రియాంక ఇన్ పాలిటిక్స్, ప్రియాంక ఎంటర్స్ పాలిటిక్స్..అంటూ ప్రియాంకా అనే పేరు ట్రెండింగ్ అయింది. ఈ ఊపు ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందా? ఏ స్థాయిలో ఓట్లు పడతాయనేది వేచి చూడాల్సిందే.