ప్రియాంక గాంధీ పార్టీ ఎఐసిసి జనరల్ సెక్రెటరీ అయ్యారు. అమేధీ నుంచి 2019 ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయవచ్చని వార్తలు వెలువడుతున్న సమయంలో ఆమెను ఉత్తర ప్రదేశ్ ఈస్ట్ ఇన్ చార్జ్ ఎఐసిసి జనరల్ సెక్రెటరీగా నియమించారు. ఇది ఆమెకు మొట్టమొదటి పార్టీ పదవి. అంటే ప్రియాంక పూర్తి స్థాయి రాజకీయ నాయకురాలు అవుతున్నారన్నమాట. ఈ ప్రాంతంలో పార్టీ నిర్మాణంతోపాటు 2019 ఎన్నికల్లో క్యాంపెయిన్ ను కూడా పర్యవేక్షిస్తారు. అన్నికంటే ముఖ్యంగా వారణాసి ఈ ప్రాంతంలోకే వస్తుంది. అంటే, ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేేేసే వారణాసి నియోజకవర్గంలో కూడా ఆమె కాంగ్రెస్ క్యాంపెయిన్ ను పర్యవేక్షిస్తారు. ఇది మోదీ మీద కాంగ్రెస్ వదలిన తూటా గా భావిస్తున్నారు.
ఇంతవరకు ఆమె అపుడపుడు చట్టపు చూపుగా రాజకీయ పర్యటనలు చేస్తూ వచ్చారు. 2017 ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో మాత్రం ఆమె ఎక్కువగా ప్రచారం చేశారు. ఆ తర్వాత మళ్లీ రాజకీయ పర్యటనలు చేయలేదు. అయితే, తల్లి సోనియాకు ఆరోగ్యం బాగా లేనందున, ఈసారి అమేధీ నుంచి పోటీ చేయకపోవచ్చని, అపుడు ప్రియాంక పోటీచేస్తారనే చర్చ పార్టీలో నడుస్తూ ఉంది. అంటే ఆమెను పూర్తి స్థాయి రాజకీయాల్లోకి తెచ్చే ఆలోచన పార్టీలో ఉందను కోవాలి. ఇలాంటపుడు ఆమెను ఎఐసిసి జనరల్ సెక్రెటరీగా నియమించారు.
దీనికి తోడు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 80 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నది. దీనికి ఒక పూర్తి స్థాయి స్టార్ క్యాంపెయినర్ కూడా కావాలి. దీనికి ప్రియాంకకు మించిన వ్యక్తి పార్టీలో లేరు.
ఈ నియామకం మీద పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ‘ ప్రియాంక సమర్థవంతురాలు. ఆమెతో కలసి ఉత్తర ప్రదేశ్ లో పనిచేయడం సంతోషంగా ఉంది,’ అని రాహుల్ పేర్కొన్నారు. ఆయన రెండు రోజుల పర్యటన మీద ఈ రోజు అమేధీ చేరుకున్నారు.
2019 ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని పూర్తిగా ప్రియాంక ఇష్టాయిష్టానికి వదిలేశామని రాహుల్ వ్యాఖ్యనించారు. అయితే, ఆమె రాక “big step to make space for the Congress in Uttar Pradesh” అని అన్నారు.
ప్రియాంక తో పాటు జ్యోతిరాధిత్య సింధియాను కూడా ఎఐసిసి జనరల్ సెక్రెటరీగా నియమించారు. ఆయన ఉత్తర ప్రదేశ్ పశ్చిమం లో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తారు.
ఈ నిర్ణయాన్ని మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు స్వాగతించారు. ఇాది పార్టీకి ‘శుభసూచకం’ అని అన్నారు.