బేటీ బచావో బేటీ పఢావో భారత ప్రభుత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమాలలో ఒకటి. ఈ ప్రచారం యొక్క ప్రధాన లక్ష్యం.. ప్రతి ఆడపిల్ల సరైన విద్యను పొందేలా చూడటం, ఆడపిల్లలందరికీ భద్రత కల్పించడం. ఈ ప్రచారాన్ని 2015 సంవత్సరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇలా చదువుకుంటూ పోతే ఈ వ్యాసం అద్భుతంగా ఉంటుంది.. ఈ కార్యక్రమం గురించి మరింత ఆసక్తిగా ఉంటుంది. ఇది 2023… ఒకసారి వాస్తవంలోకి వద్దాం…!
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షులు, బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ ను తొలగించాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నిరవధిక నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ప్రధాని మోడి మౌనాన్నే తన బాషగా చేసుకున్నారు. కర్ణాటకలో ప్రజలు తిరస్కరించినా కూడా మోడీకి మెలుకువ రావడం లేదంటూ కామెంట్లు వెలుస్తున్నాయి. పైగా… ఈ బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు మాఫియాతోనూ సంబంధాలున్నట్లు కథనాలొస్తున్నాయి.
అయినా సరే వీరి సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ప్రధాని కంటికి కనిపించేలా ఎదురెళ్లి తమ సమస్యను చెప్పుకుందామని రెజ్లర్లు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం వేళ అటు వైపు మౌనంగా మార్చ్ చేపట్టారు. దీంతో రెజ్లర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీసింది.
అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన మల్లయోధులు.. నేడు వీధుల్లో ఆందోళన చేస్తున్నారు. అయినా ప్రధాని పట్టించుకోవడం లేదు. మఠాధిపతులతో బిజీగా గడిపేస్తున్నారు. సెంగోల్ (రాజదండం) చేతపట్టి ఇది ప్రజాస్వామ్య దేశమన్న విషయాన్ని ప్రజలకు దూరం చేస్తున్నారు. మ్యూజియంలో ఉంచాల్సిన వస్తువుని పార్లమెంటుకు తీసుకొచ్చారు! మరి ఈ విషయంలో ఎప్పటికి వీరి సమస్య పరిష్కారమవుతుందో… మళ్లీ ఒలింపిక్స్ వచ్చే వరకూ వేచి చూడాలో ఏమో.. అంటూ నాన్ స్టాప్ గా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!
కాగా, భాజపా ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ పలువురు అథ్లెట్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని.. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దాదాపు నెల రోజులకు పైగా ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజ్‌రంగ్ పునియా తదితరులు ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా మోడీ సర్కార్ పై విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. రెజ్లర్లను అడ్డుకొని అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న వీడియోను సాక్షి మాలిక్ ట్విటర్ లో షేర్ చేయగా.. దీనిపై ప్రముఖులంతా స్పందిస్తున్నారు. “క్రీడాకారుల ఛాతీపై ఉన్న పతకాలు మన దేశానికి గర్వకారణం. ఆ పతకాలతో క్రీడాకారుల కృషి వల్ల దేశ గౌరవం పెరుగుతుంది. బీజేపీ ప్రభుత్వ దురహంకారం ఎంతగా పెరిగిపోయిందంటే ప్రభుత్వం కనికరం లేకుండా మన మహిళా క్రీడాకారుల గొంతులను బూటు కింద తొక్కేస్తోంది” అంటూ ఈ సంఘటనపై ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఇదే క్రమంలో… దేశ గౌరవాన్ని పెంచే మన క్రీడాకారులతో ఇలా ప్రవర్తించడం తప్పని.. ఇది తీవ్ర గర్హనీయమని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.