ఈ మధ్య కాలంలో ప్రముఖ పార్టీల నేతలు తమ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రజలను ఆకర్షించే పథకాలను ప్రకటిస్తున్నారు. ఆ పథకాలలో కొన్ని పథకాలు ఆచరణ సాధ్యం కాని పథకాలు కావడం గమనార్హం. ముఖ్యంగా ఏపీలో ఉచిత హామీలు ఎక్కువగా అమలులో ఉన్నాయని పలు రాజకీయ పార్టీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అయితే తాజాగా మోదీ ఉచిత హామీలు, ఉచిత పథకాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓట్ల కోసం ఇచ్చే ఉచిత హామీలు దేశాభివృద్ధికి చాలా ప్రమాదకరం అని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ఉచిత హామీలను అమలు చేస్తున్న జగన్, కేసీఆర్ లను కూడా పరోక్షంగా హెచ్చరించారని చెప్పవచ్చు. మోదీ తన స్పీచ్ లో ఉచిత పథకాల విషయంలో ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉండాలని కామెంట్లు చేశారు. బీజేపీ ప్రభుత్వం సౌకర్యాలను కల్పించడంతో పాటు దేశ భవిష్యత్తును నిర్మిస్తోందని మోదీ చెప్పుకొచ్చారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ఉచిత పథకాల వల్ల కొన్ని సందర్భాల్లో అనర్హులకు కూడా పథకాల ద్వారా లబ్ధి చేకూరుతోంది. ఉచిత పథకాల వల్ల ప్రజలలో కొంతమంది సోమరిపోతులు అవుతున్నారనే భావన చాలామందిలో ఉంది. ఉచిత పథకాల ద్వారా అందుతున్న డబ్బును వృథాగా ఖర్చు చేసేవాళ్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఉచిత పథకాలు దేశ అభివృద్ధికి చేటు చేస్తాయనే సంగతి తెలిసిందే. అయితే మోదీ సర్కార్ సైతం ఉచిత పథకాలను అమలు చేస్తోందని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతుండటం వల్ల మోదీ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. అయితే మోదీ సర్కార్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను మాత్రం నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
