పేరు మోసిన ‘పోల్ పండితుడు’ ప్రశాంత్ కిశోర్ (40)ను జనతాదళ్ (యునైెటెడ్ ) పార్టీకి ఉపాధ్యక్షుడయ్యారు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ కు ఇపుడు సలహాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. గత నెలలో ఆయన బీహార్ వెళ్లిపోాయారు, అక్కడ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ నాయకత్వంలోని జనతా దళ్ (యు)లోచేరారు. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
ఆయనకు నితిష్ కుమార్ చాలా కీలకమయిన బాధ్యతలను అప్పగిస్తున్నారని అపుడే ఒక వార్త వినిపించింది. ఆయన్ని తన వారసుడిగా నితిష్ తీర్చి దిద్దుతున్నారని కూడా వార్తలొచ్చాయి. ఈ వార్తలు సద్దు మణగక ముందే ఆయన్ని నితిష్ కుమార్ పార్టీకి ఉపాధ్యక్షుడిగా నియమించారు.
ప్రచారంతో ఓటర్లను పల్టీ గొట్టించడంలో ప్రశాంత కిశోర్ దిట్ట. ఇదే ఆయన్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చింది. 2014 ఎన్నికల్లో మోదీ ని పాపులర్ లీడర్ని చేసింది ఆయన ప్రచారమే అని చెబుతారు. మోదీ ఒక టీ కొట్టు యజమాని కొడుకనే మాట తీసుకుని ఛాయ్ చట్టు ప్రచారాన్ని తిప్పి మోదీని గెలిపించారని ఆయనకు ఖ్యాతి వచ్చింది. అయితే, బిజెపికి ఇది నచ్చలేదు. మోదీ సొంత ఆకర్షణతోనే గెలిచారని, ప్రచార పటాటోపం కాదని ఆ పార్టీ విశ్వాసం. ప్రశాంత్ కిశోర్ ప్రచారం అంటే మోదీ శక్తియుక్తులను తక్కువ అంచనా వేసినట్లవుతుంది. అ ందుకే ప్రధాని అయ్యాక మోదీ ఆయన్ని వదిలేశారు. ఈ కోపం ఆయన్ని ఇతర పార్టీల దగ్గరకు చేర్చింది. అపుడే బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్, నితిష్ కలుస్తున్నారు. ఈ కూటమికి ఆయన ప్రచారం చేశారు. నితిష్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు బాట వేశారు. ప్రచారంలో ఉన్న మంత్ర శక్తి తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆయన్ని పంజాబ్, ఉత్తర ప్రదేశ్ ల లో సలహా దారుగా తీసుకుంది.
ఇక్కడ ఆంధ్రలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన మార్గదర్శకత్వంలో పనిచేయడం మొదలుపెట్టారు. ప్రశాంత్ మీద జగన్ కు ఎంత గురి కుదిరిందంటే ఆయన ఆధ్వర్యంలో వైఎస్సార్సి గెలుస్తుందని ప్రకటించడంమొదలు పెట్టారు. బహిరంగ సభల్లో ఆయనను పరిచయం చేయడం కూడ మొదలుపెట్టారు.చివరకు అభ్యర్థుల ఎంపిక కూడా ప్రశాంత్ కిశోర్ చెప్పినట్లే చేయడం జరుగుతున్నది పార్టీలో చెబుతున్నారు. సర్వేల ద్వారా పార్టీ బలహీనతలను కనిపెట్టి దానిని అధిగమించేందుకు ఆయన ప్రచారం రూపొందిస్తారు. ఇదే వశీకరణ విద్యలాగా పని చేసి ఓటర్లను ఆ పార్టీ వైపు తిప్పుతుందని ఆయన ఫిలాసఫీ. అందుకే ఆయన్ను డబ్బున్న పార్టీలన్నీ సలహాదారుగా పెట్టుకుంటుంటాయి. ఆంధ్రకొచ్చింది కూడా వైసిపి బలాలు, బలహీనతలను గుర్తించేందుకే. ఈ పని పూర్తయ్యే దశలో నితిష్ ఆహ్వానం మేరకు ఆయన సొంత రాష్ట్రం బీహార్ వెళ్లిపోయారు.
నితిష్ ఆహ్వానం వెనక పెద్ద ప్లాన్ ఉందని చెబుతారు. ఈ మధ్య మోదీ హవా కొద్దిగా తగ్గడం, అవినీతి ఆరోపణలు రావడంతో బిజెపి మళ్లీ కిశోర్ తో సంప్రదింపులు మొదలుపెట్టిందని, అది తెలిసి, ఆయనను బిజెపికిఅందుబాటులో లేకుండా చేసేందుకు ఇలా పార్టీలోకి ఆహ్వానించాడని రాజకీయవర్గాలలో వినబడుతూ ఉంది.
ఇలాంటి దశలో ప్రశాంత్ కిశోర్ జనతా దళ్ (యు) లోచేరి ఏకంగా ఉపాధ్యక్షుడయ్యారు. ఇది సీనియర్లకు కొంత ఇబ్బందిగానే ఉన్నట్లు తెలుస్తున్నది.
జనతా దళ్ (యు ) ప్రతినిధి కెసి త్యాగి ప్రశాంత్ కిశోర్ నియామకం గురించి వెళ్ల డించారు. తమ పార్టీకి ఉన్న సాంప్రదాయిక వర్గాల మద్దతుకు తోడుగా కొత్త వర్గాలను పార్టీపరిధిలోకి తెచ్చేందుకు ప్రశాంత్ కిశోర్ మార్గదర్శకత్వం సహాయపడుతుందని చెప్పారు.