IPL Teams: ఐపీఎల్ జెర్సీల్లో రాజకీయ నాయకులు.. ఏఐ ద్వారా చేసిన వీడియో వైరల్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ 2025 హీట్ నడుస్తోంది. ప్రతి రోజు జరుగుతున్న మ్యాచ్‌లు అభిమానులకు మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. వీకెండ్లలో డబుల్ హెడర్లు వచ్చేసరికి క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్‌గానే ఎంజాయ్ చేస్తున్నారు. మార్చి 22 నుంచి ప్రారంభమైన ఐపీఎల్ 18వ సీజన్ మే 25 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ సంబంధించి ఒక ఆసక్తికర వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో భారతదేశంలోని టాప్ రాజకీయ నాయకులు ఐపీఎల్ జెర్సీలు ధరించి మైదానంలో ఉండటం కనిపిస్తోంది. ఇది కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందించిన ఫేక్ వీడియో అయినా, దీని క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాయల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు జెర్సీలో కనిపించగా, రాహుల్ గాంధీ పంజాబ్ కింగ్స్‌ జెర్సీలో ఉన్నారు.

సోనియా గాంధీ లక్నో జెర్సీతో కనిపించగా, అమిత్ షా చెన్నై సూపర్ కింగ్స్‌లో, రాజ్‌నాథ్ సింగ్ గుజరాత్ టైటాన్స్‌కు, నిర్మలా సీతారామన్ రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించినట్టుగా చూపించారు. అలాగే విదేశాంగ మంత్రి జైశంకర్ ఎస్ఆర్‌హెచ్ జెర్సీలో, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్‌కతా నైట్‌రైడర్స్ జెర్సీలో కనిపించారు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీలో, దేవేంద్ర ఫడ్నవీస్ ముంబయి ఇండియన్స్ జెర్సీలో కనిపించడం విశేషం. ఈ వీడియోపై నెటిజన్లు చమత్కారంగా స్పందిస్తున్నారు.

“మోదీకి బెంగ‌ళూరు జెర్సీ బాగా సూట్ అయింది”, “నిర్మలా మ్యాడం బౌలింగ్ చేస్తే ఓపెనర్లు కంగారు పడిపోతారు”, “కేజ్రీవాల్ ఢిల్లీకి సరైన కెప్టెన్” అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. క్రియేటివ్‌గా తయారైన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఐపీఎల్‌కు సంబంధించిన ఈ మిమిక్రీ క్రియేటివిటీతో నెటిజన్లను అలరిస్తోంది.