మద్యం సేవించి పాఠాలు చెబుతున్న పంతులమ్మ.. టీచరమ్మపై సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు!

ప్రస్తుత కాలంలో ఆడ మగ అని తేడా లేకుండా చిన్నపిల్లల నుండి ముసలి వారి వరకు అందరూ మద్యానికి అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఉద్యోగస్తులు ప్రతిరోజు మద్యం సేవించి విధులకు హాజరవుతున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు కూడా పిల్లలకు మద్యం మత్తులో పాఠాలు చెబుతున్నారు. ఈ క్రమంలో తుమకూరు తాలూకా చిక్కసారంగి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న గంగలక్ష్మమ్మ అని మహిళా ఉపాధ్యాయురాలు ప్రతిరోజు మద్యం సేపించి విధులకు హాజరవుతూ పిల్లలకు మద్యం మధ్యలోనే పాఠాలు బోధిస్తోంది. ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులకు పట్టుబడి ఉద్యోగం నుండి సస్పెండ్ అయ్యింది.

వివరాలలోకి వెళితే… గంగలక్ష్మమ్మ అనే మహిళ తుమకూరు తాలూకా చిక్కసారంగి ప్రాథమిక పాఠశాలలో గత 25 సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గత ఐదు సంవత్సరాల నుండి గంగ లక్ష్మమ్మ మద్యానికి అలవాటు పడి బానిసగా మారింది. దీంతో ప్రతిరోజు ఉదయం మద్యం సేవించి పాఠశాలకు వచ్చి విద్యార్థులకు పాఠాలు బోధించేది. అయితే మద్యం మత్తులో ఉండటం వల్ల కొన్ని సందర్భాలలో ఆ కారణంగా విద్యార్థులను కొట్టడం వారి మీద చిరాకు పడటం చేస్తూ ఉండేది. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో తోటి ఉపాధ్యాయులతో కారణం లేకుండానే గొడవలు పడుతూ ఉండేది.

అయితే గంగ లక్ష్మమ్మ ప్రవర్తనతో విసిగిపోయిన విద్యార్థులు ఒక తోటి ఉపాధ్యాయులు పలుమార్లు ఆమె ప్రవర్తన మార్చుకోవాలని సర్ది చెప్పారు. అయినా ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తాళాలు వేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన తాలూకా విద్యాధికారి(బీఇవో) హనుమానాయక్‌ ఈ విషయంపై దర్యాప్తు చేయగా ఉపాధ్యాయురాలి టేబుల్ డ్రాలో రెండు మద్యం సీసాలు లభించాయి. దీంతో గంగ లక్ష్మమ్మ ఆవేశంగా తరగతి గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని అందరినీ బెదిరించింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు పాఠశాలకు చేరుకుని గంగలక్ష్మమ్మను అదుపులోకి తీసుకున్నారు. విద్యాశాఖ అధికారులు ఆమెను ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు.