రాహుల్ స్వాగత ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, ఓయూలో ఆందోళన

తెలంగాణలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహూల్ గాంధీ హైదరాబాద్ వచ్చారు. రాహుల్ గాంధీకి ఎయిర్ పోర్టులో కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. రాహూల్ కు స్వాగతం తెలుపుతూ ఓయూ విద్యార్ధి నేతలు ఓయూ లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు రాహుల్ స్వాగత ర్యాలీని చేపట్టారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని ఓయూ పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీని అడ్డుకోవడంతో పోలీసులపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టిఆర్ఎస్వీ చేపట్టిన నల్లజెండాల ర్యాలీకి అనుమతిచ్చి మాకెందుకు ఇవ్వరని విద్యార్థి నేతలు మండిపడ్డారు. గులాబీ దుస్తులేసుకున్న ఓయూ ఖాకీలు ఐక్య విద్యార్ధి సంఘాల గులాబీ ర్యాలీని నిలువరించాయంటూ విద్యార్థులు పోలీసులను దుయ్యబట్టారు. రాహుల్ గాంధీని నాలుగు కోట్ల ప్రజానీకం స్వాగతిస్తుంటే కేసీఆర్ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అడ్డుకోవాలని చూడటం కుటిల రాజనీతికి నిదర్శనం అని విద్యార్థి సంఘం నేత మానవతారాయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘాల నేతలు నారాయణఖేడ్ శివరాజ్, చనగాని దయాకర్, లింగస్వామి, రంగనాధ్ గౌడ్, కల్వకుర్తి ఆంజనేయులు, బొబ్బిలి యుగంధర్, రెడ్డి శ్రీను, లీగల శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.