నక్కీరన్ పత్రిక గోపాల్ అరెస్టు

చెన్నైలో నక్కీరన్ మ్యాగజైన్ ఎడిటర్ గోపాలన్ ను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు గవర్నర్  భన్వరీలాల్ పురోహిత్  పై వివాదాస్పద వ్యాఖ్యలు ప్రచురించినందుకు గవర్నర్ కార్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నక్కీరన్ పుణెకు వెళుతుండగా మంగళవారం ఉదయం చెన్నైఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. గోపాలన్ ను చింతాద్రి స్టేషన్ కు తరలించారు.  విద్యార్ధినుల వేధింపుల కేసులో గవర్నర్ పై వివాద వ్యాఖ్యలు ప్రచురించినందుకు అరెస్టు చేశారు.

విరుధనగర్ జిల్లాలోని దేవాంగ ఆర్ట్స్ కాలేజి ప్రొఫెసర్ నిర్మలా దేవి విద్యార్ధినులను వేధించారు. మీరు ఇతర అధికారులతోటి సెక్స్ కు సహకరిస్తే మీకు మంచి మార్కులతో పాటు భవిష్యత్తు ఉంటుందని వారి పై ఒత్తిడి తెచ్చింది. దీనిలో గవర్నరే ఉన్నాడని మీరు ఏం చేసినా ఏం కాదని నిర్మలా దేవి విద్యార్థినులను వేధించింది.

ప్రొఫెసర్ వేధింపులు తాళలేక విద్యార్థినులు రహస్యంగా ఫోన్ కాల్ రికార్డు చేసి దానిని సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో  ఈ సంఘటన ఏప్రిల్ లో పెద్ద దుమారం రేగింది. ప్రతిపక్ష పార్టీలన్నీ ఆందోళనలు చేశాయి. గవర్నర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ వార్తను నక్కీరన్ మ్యాగజైన్ గవర్నర్ పాత్ర పై బహిరంగంగా ప్రచురించింది. దీంతో అప్పట్లో పెను సంచలనమైంది.

దీని పై గవర్నర్ స్పందిస్తూ ఈ కేసుకు తనకు సంబంధం లేదని, తనను నిత్యం అనేక మంది కలుస్తుంటారని అలాగే నిర్మలా దేవి కూడా తనను కలిశారన్నారు. మీడియా అతి చేసిందని అందరిపై కేసు పెడతానని గవర్నర్ గతంలోనే చెప్పాడు. దీంతో గవర్నర్ కార్యాలయం ఫిర్యాదుతో పోలీసులు గోపాలన్ ను అరెస్టు చేశారు.

నక్కీరన్ మ్యాగజైన్ తమిళనాడులో చాలా ఫేమస్. డేర్ అండ్ డాష్ గా ప్రజా పక్షాన వార్తలు రాస్తుందని పేరు ఉంది. గతంలో మాఫియా డాన్ వీరప్పన్ ను కూడా ఇంటర్వ్యూ చేసి సంచలనం సృష్టించింది. ఇలా ఎన్నో సంచలనాలను నక్కీరన్ మ్యాగజైన్ బయటపెట్టింది. గోపాలన్ అరెస్టు ను పలువురు జర్నలిస్టులు, నాయకులు, మేధావులు ఖండిస్తున్నారు.