పుట్టిన బిడ్డను చూడకుండానే వీరమరణం పొందిన జవాన్

ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానుల కుటుంబాల కథలు ఒక్కొకరివి ఒక్కోలా ఉన్నాయి.  వీరిలో ఓ జవాను తన రెండు నెలల కూతురిని పుట్టినప్పటి నుంచి కనీసం ఒక్కసారి కూడా చూడకుండానే ఉగ్రదాడిలో వీరమరణం పొందారు.

రాజస్తాన్‌లోని జైపూర్‌ సమీపంలోని అమర్‌సర్‌లోని గోవింద్‌పురా గ్రామానికి చెందిన రోహితేష్‌ లంబా(27) సీఆర్పీఎఫ్‌ జవాన్‌గా సేవలందిస్తున్నారు. రోహితేష్‌ లంబా 25 ఏళ్లకే  సీఆర్పీఎఫ్‌లో ఉద్యోగం వచ్చింది. ఆ మరుసటి సంవత్సరం వివాహం చేసుకున్నారు. అయితే గతేడాది డిసెంబర్‌లో రోహితేష్‌ లంబా దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఉద్యోగరిత్యా చిన్నారిని చూడడానికి వీలు దొరక్కపోవడంతో కన్నకూతురును ఇప్పటి వరకు చూడలేకపోయారు.

బిడ్డను చూసేందుకు సెలవు పెట్టి గోవింద్‌పురాకు త్వరలోనే వెళ్లాలనుకున్నారు. కన్న కూతురును చూడడానికి వస్తాడనుకున్న భర్త  ఉగ్రవాదుల దాడిలో మరణించాడన్న వార్తను భార్య వినాల్సి వచ్చింది.  రోహితేష్‌ లంబా వీరమరణంతో గోవింద్‌పురాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబం ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి దిక్కు తోచని స్థితిలో పడింది. ఇక తన జీవితంలో నాన్న అని పిలిచే అదృష్టం తనకు లేదని తెలియని చిన్నారి బోసి నవ్వులు నవ్వుతుంది. దీంతో ఆమెను  చూసిన వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.