లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ కన్నుమూత

లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ కన్ను మూశారు. 89 ఏళ్ల వయస్సున్న ఆయన గత కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. నెల క్రితం ఆయనకు గుండెపోటు రావడంతో అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోమనాథ్ కు మూత్రపిండాల వ్యాధి సమస్య తిరగబెట్టింది. దీంతో కోల్‌కత్తాలోని బెల్లెవ్యూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆయన మృతి చెందారు.

సీపీఎం పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన సోమనాథ్ ఛటర్జీ 10 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. సెంట్రల్ కమిటీ మెంబర్ గా పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు లోక్ సభ స్పీకర్ గా పనిచేశారు. 2008 లో సీపీఎం యూపీఏ ప్రభుత్వానికి మద్దతు విరమించుకున్నా ఆయన స్పీకర్ పదవికి రాజీనామా చేయలేదు.

1929 జూలై 25న అసోంలోని తేజ్ పూర్ లో సోమ్ నాథ్ ఛటర్జీ జన్మించారు. మిత్రా ఇనిస్టూట్ లో పాఠశాల విద్య పూర్తి చేశారు. ప్రెసిడెన్సీ కాలేజీ కలకత్తా యూనివర్సిటిలో ఉన్నత విద్య అభ్యసించారు. రాజకీయాల్లోకి రాకముందు ఛటర్జీ కలకత్తా హైకోర్టలో న్యాయవాదిగా పనిచేశారు. 1968లో సీపీఎంలో చేరిన ఛటర్జీ పది సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2008లో సీపీఎం యూపీఏ కి మద్దతు ఉపసంహరించుకున్నా కూడా ఆయన స్పీకర్ పదవికి రాజీనామా చేయకపోవడంతో సీపీఎం పార్టీ అతనిని బహిష్కరించింది. అయినా కూడా ఛటర్జీ ఏ పార్టీలోకి చేరకుండా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సోమనాథ్ ఛటర్జీ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇతర పార్టీల నేతలు  సంతాపం తెలిపారు.