కోల్‌క‌త ర‌చ్చర‌చ్చ‌: అర్ధ‌రాత్రి హైడ్రామా!

ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌త‌లో అర్ధ‌రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. సీబీఐ అధికారుల రాక‌ను నిర‌సిస్తూ స్వ‌యంగా ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ధ‌ర్నాకు దిగారు. స్థానిక మెట్రో రైల్వేస్టేష‌న్ వ‌ద్ద బైఠాయించారు. ఆమెకు మ‌ద్ద‌తుగా రాష్ట్ర మంత్రులతో పాటు తృణ‌మూల్ కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు పెద్ద ఎత్తున త‌ర‌లిరావ‌డంతో ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.

త‌మ నాయ‌కురాలు ధ‌ర్నా చేస్తోన్న స‌మాచారం రాష్ట్ర వ్యాప్తంగా దావాన‌లంలా వ్యాపించింది. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అర్ధ‌రాత్రి రోడ్ల మీదికి వచ్చారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. చాలా చోట్ల ఆయ‌న దిష్టిబొమ్మ‌ల‌ను ద‌గ్ధం చేశారు. సోమ‌వారం రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇచ్చారు.

శార‌దా పోంజీ, రోజ్‌వ్యాలీ కుంభ‌కోణాల్లో భాగంగా కోల్‌క‌త పోలీస్ క‌మిష‌న‌ర్ రాజీవ్‌కుమార్‌ను విచారించ‌డానికి సీబీఐ అధికారులు రావ‌డం.. ఈ ఉద్రిక్త‌త‌ల‌కు ప్ర‌ధాన కార‌ణం. సీబీఐ అధికారుల‌ను కోల్‌క‌త పోలీసులు అడ్డుకున్నారు. వారిని నిర్బంధించి, పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

దీనిపై స‌మాచారం అందుకున్న వెంట‌నే మ‌మ‌తా బెన‌ర్జీ రాజీవ్ కుమార్ నివాసానికి చేరుకున్నారు. ఆయ‌న‌తో మాట్లాడారు. అనంత‌రం- అక్క‌డే ఆందోళ‌న‌కు దిగారు. కేంద్ర‌ప్ర‌భుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోందని ఆరోపించారు. ఈ విష‌యాన్ని తాను ఇంత‌టితో వ‌దిలేది లేద‌ని తేల్చిచెప్పారు. ఓ ర‌కంగా ఆమె కేంద్ర ప్ర‌భుత్వంపై యుద్ధాన్ని ప్ర‌క‌టించారు.

సీబీఐ అధికారులు ఏ కార‌ణంతో ఈ విచార‌ణ‌ను కొన‌సాగిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. మ‌మ‌తా బెన‌ర్జీ ఆందోళ‌న చేస్తోన్న స‌మాచారం అందుకున్న వెంట‌నే ప‌లువురు పార్టీల నాయ‌కులు ఆమెకు ఫోన్ చేశారు. మ‌ద్ద‌తు ప‌లికారు. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, అఖిలేష్ యాద‌వ్‌, మాజీ ప్ర‌ధాని దేవేగౌడ‌, తేజ‌స్వి యాద‌వ్ త‌దిత‌రులు మ‌మ‌త‌కు ఫోన్ చేశారు.

మ‌మ‌త జోక్యం చేసుకోవ‌డానికి వ్య‌తిరేకిస్తూ సోమ‌వారం సుప్రీంకోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. రాజ్యాంగ బ‌ద్ధంగా తాము విధుల‌ను నిర్వ‌ర్తిస్తున్నామ‌ని, అడ్డుకోవ‌డం స‌హేతుకం కాద‌ని అన్నారు.