పవన్ ను కుమారస్వామితో పోల్చుకుంటున్న బాబు!

ఇండోనేషియాలో సునామీ వస్తే ఇండియా మొత్తం వణికినట్లుంది.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల పరిస్థితి! కారణం… కర్ణాటకలో ఎన్నికలు ముగిసిన అనంతరం తెరపైకొచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏపీలో చంద్రబాబుని టెన్షన్ పెడుతున్నాయంట. అలా జరగకూడదని, ఇలా జరగకూడదని బాబు తెగ టెన్షన్ పడుతున్నారంట. ఇంతలా బాబుని టెన్షన్ పెడుతున్న అంశమేమిటనేది ఇప్పుడు చూద్దాం!

కర్ణాటకలో ఎన్నికలు ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెరపైకి వచ్చాయి. ఈ ఫలితాల ప్రకారం… 100 నుంచి 110 స్థానాల వరకూ కాంగ్రెస్ పార్టీకి రావొచ్చు, 80 నుంచి 90 స్థానాల వరకూ బీజేపీ పొందొచ్చు, ఇక జేడీఎస్ పార్టీ 20 నుంచి 30స్థానాల్లో గెలుపొందొచ్చు. అంటే… ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అసలు ఫలితాల్లో మరో 20స్థానాల వరకూ తోడయితే సరే కానీ… అలా కానిపక్షంలో జేడీఎస్ కీలకంగా మారబోతుంది.

ఇందులో భాగంగా… కర్ణాటకలో ఏపార్టీ అధికారంలోకి రావొచ్చు అనే విషయంలో ఐదు ఆప్షన్ ఉన్నాయి. వాటిలో ఒకటి… కాంగ్రెస్ పార్టీకి ఎగ్జిట్ పొల్స్ అంచనాలను దాటుకుని మరిన్ని సీట్లు వస్తే ఆ పార్టీనే ఇండిపెట్ గా అధికారం చేపట్టే అవకాశం ఉంది. అదేవిధంగా… రిస్క్ ఎందుకు అని భావిస్తే… కాంగ్రెస్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్లస్ జేడీఎస్ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడే ఛాన్స్ రెండోదిగా కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి జేడీఎస్ అవసరం కంపల్సరీ అయిన నేపథ్యంలో… జేడీఎస్ సారధ్యంలో “జేడీఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం” ఏర్పడినా ఆశ్చర్యం లేదని అంటున్నారు విశ్లేషకులు.

ఇదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లోని నెంబర్స్ బీజేపీకి స్వల్పంగా పెరిగితే… జేడీఎస్ ను కలుపుకుని బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేమని కూడా ఒక విశ్లేషణ తెరపైకి వచ్చింది. ఇక ఆఖరిగా… ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మించి జేడీఎస్ కు 30స్థానాలు పైబడి వచ్చిన పక్షంలో… జేడీఎస్ కాస్త పట్టుబట్టిన పరిస్థితుల్లో… జేడీఎస్ ఆధ్వర్యంలో “జేడీఎస్ – బీజేపీ కూటమి” అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు.

అంటే… ఈ నెల 13న రాబోయే అసలు ఫలితాల సంగతి కాసేపు పక్కనపెట్టి ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలను పరిగణలోకి తీసుకుంటే… కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటులో జేడీఎస్ కీలకంగా మారబోతుంది. ఇక రెండు సందర్భాల్లో… జేడీఎస్ పార్టీ ప్రధానంగా మారి ఇతరులను కలుపుకుని కుమార స్వామి సీఎం అయినా ఆశ్చర్యం లేని ఆప్షన్స్ తెరపైకి వచ్చాయి. దీంతో… కుమారస్వామితో కంపేర్ చేసుకుని పవన్ విషయంలో బాబు టెన్షన్ పడుతున్నారంట.

అవును… కర్నాటకలో పాతిక సీట్లు వచ్చినా కూడా కుమార స్వామి సీఎం అయితే… ఆ ఎఫెక్ట్ కచ్చితంగా ఏపీ రాజకీయాల్లో జనసేనపై పడుతుందని చంద్రబాబు ఆందోళనలో ఉన్నారంట. రాబోయే ఎన్నికల్లో పొత్తు లేకుండా.. పవన్ ఒక 50 సీట్లలో పోటీచేసి 25 సీట్లలో గెలుపొందినా కూడా… ఏకు మేకై కూర్చునే ప్రమాధం లేకపోలేదని టెన్షన్ పడుతున్నారంట. దీంతో… కర్నాటకలో కుమారస్వామి సీఎం అవ్వకూడదని… ప్రధాన పార్టీలకు మిత్రపక్షంగా మాత్రం అధికారాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నారంట బాబు!