సాధారణంగా చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లలను భారంగా భావిస్తారు. అందువల్ల ఆడపిల్ల పుట్టగానే అభం శుభం తెలియని ఆ పసికందులను చెట్ల పొదల్లో నిర్మానుష ప్రదేశాలలో వదిలేసి వెళుతూ ఉంటారు. ఇలా ప్రతి ఏటా ఎంతోమంది ఆడ శిశువులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుత కాలంలో ఆడపిల్లలు అన్ని విషయాలలోనూ మగవారికి ధీటుగా ఉంటున్నారు. అయినప్పటికీ ఆడపిల్లల పట్ల ఉన్న వివక్ష ఇప్పటికీ అలాగే ఉంది. ఈ క్రమంలో ఇటీవల రెండు నెలల వయసున్న పసికందు ఆ తల్లిదండ్రులకు భారం అయింది. అందుకే తల్లిదండ్రులు స్వయంగా ఆ చిన్నారిని రోడ్డుపై వదిలేసి వెళ్లిన ఘటన చర్చనీయంగా మారింది. ఈ దారుణ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళితే… సూరత్ లో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ పై సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో బ్రిడ్జిపై ఒంటరిగా ఉన్న రెండు నెలల చిన్నారిని గుర్తించిన స్థానికులు చిన్నారి గురించి పోలీసులకు సమాచారం అందించారు. సోమవారం రాత్రి 10:30 సమయంలో కేబుల్ బ్రిడ్జిపై చిన్నారి ఏడుపు వినిపించడంతో అటుగా వెళుతున్న స్థానికులు ఆ పాపను గుర్తించారు. పాప గురించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. పాప గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన కేబుల్ బ్రిడ్జి వద్దకు చేరుకొని రోడ్డుమీద ఏడుస్తూ ఉన్న రెండు నెలల చిన్నారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమయంలో ఇలా రోడ్డుమీద చిన్నారి ఒంటరిగా ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా బ్రిడ్జిపై అమర్చిన సిసిటీవీ కెమెరాలను పరిశీలించగా పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన పోలీసులకు.. ఆ వీడియోలో ఓ పురుషుడు, మహిళ ఆ చిన్నారిని వదిలి వెళ్తున్నట్లు కనిపించింది. దీంతో నగరంలో ఉన్న సీసీటీవీ కెమేరాల ద్వారా వారిని ట్రేస్ చేయగా.. వారు రిక్షా ఎక్కి సూరత్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారని, అక్కడి నుంచి వల్సాద్ వెళ్లే రైలు ఎక్కారని పోలీసులు గుర్తించారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు సూరత్, వల్సాద్ మధ్య ఏదో ఒక ఊరిలో నివసిస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. వారిని కనుగొనేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేశారు.