హిందూ సంప్రదాయంలో సోమవారం అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ముఖ్యంగా ఈ రోజు శివారాధన ఎంతో ఉత్తమమని చెబుతారు. ఈ రోజున భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. వివాహం ఆలస్యం అవుతున్నవారికి శుభఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక చంద్రగ్రహం మనసును, మానసిక సమతుల్యతను నియంత్రించేదిగా పరిగణిస్తారు. అందువల్ల చంద్రదోషం ఉన్నవారు సోమవారం ఉపవాసం ఉండి, శివుడిని పూజిస్తే ఆ దోషం తగ్గిపోతుందని విశ్వాసం ఉంది.
భక్తులు శివుడిని పూజించడం మాత్రమే కాకుండా దాన ధర్మాలు కూడా చేస్తే శుభఫలితాలు మరింత పెరుగుతాయని పండితులు పేర్కొంటున్నారు. ఎందుకంటే శివుడు “అన్నదాన ప్రియుడు” అని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజు దానం చేయడం ద్విగుణీకృత ఫలితాలను ఇస్తుందని నమ్మకం ఉంది. బియ్యం దానం చేయడం అత్యంత శ్రేయస్కరం. చంద్రునికి ఇది అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. బియ్యం దానం చేసినవారి ఇంట్లో శాంతి, ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని పెద్దలు చెబుతారు. అలాగే తెల్లటి బట్టలు ధరించడం శుభప్రదం, వాటిని దానం చేస్తే గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయని నమ్మకం ఉంది.
ఇక శంఖం, గంధం, పెరుగు, తీపి పదార్థాలు, ముత్యాలను దానం చేస్తే దంపతుల జీవితంలో వైవాహిక సౌఖ్యం, సంతోషం పెరుగుతాయని చెబుతారు. అలాగే నీరు మరియు వెండి దానం చంద్రదోషాన్ని తగ్గిస్తుందని విశ్వాసం ఉంది. నీటి దానం ద్వారా పితృదేవతలు సంతోషిస్తారని పెద్దలు అంటుంటారు. ఇక శివలింగానికి బెల్లం , శమీ ఆకులు సమర్పించి ఆ తరువాత వాటిని దానం చేస్తే పాపాలు తొలగి పుణ్యం పెరుగుతుందని పురాణ వచనాలు చెబుతున్నాయి. ముత్యాలను ధరించడం లేదా దానం చేయడం ఆర్థిక పరిస్థితిని బలపరచి, ఏకాగ్రత, నిర్ణయ సామర్థ్యాలను పెంచుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఇక శివపూజ సమయంలో ఓంకార మంత్ర జపం, “ఓం నమః శివాయ” అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించడం అత్యంత శ్రేయస్కరమని శాస్త్రాలు సూచిస్తున్నాయి. దీనివల్ల మనసుకు శాంతి కలిగి, ఆత్మీయ స్థైర్యం పెరుగుతుంది. కాబట్టి సోమవారం ఉపవాసం, శివపూజ, దానధర్మం కలిపి చేయడం ద్వారా జీవితంలో శాంతి, సంపద, సుఖసంతోషాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు. మొత్తానికి సోమవారం శివుని ఆరాధించడం ద్వారా చంద్ర దోషం తొలగిపోగా, దాన ధర్మం శివుని ప్రీతిపాత్రమై భక్తుల జీవితాన్ని సాఫీగా మార్చుతుందని విశ్వాసం. ఒక గుప్పెడు బియ్యం కూడా భక్తితో సమర్పిస్తే శివుడు సంతోషిస్తాడు అని పురాణాలు పేర్కొంటున్నాయి.
