విమాన ప్రయాణికులకు శుభవార్త! ఇకపై డొమెస్టిక్ విమాన ప్రయాణికులు తమ వెంట ఆధార్, పాన్ ఇతర గుర్తింపు కార్డులను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రయాణ టికెట్లు, గుర్తింపు కార్డులతో పని లేకుండా ఫేషియల్ రికగ్నిషన్ బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకుని రానున్నారు. అంటే- బయోమెట్రిక్ విధానం ద్వారా మన ముఖాన్ని స్కాన్ చేస్తారన్నమాట. దేశంలోనే మొదటిసారిగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకుని రానున్నారు.
మార్చి 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తోన్న జీఎంఆర్ సంస్థ ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ఇదివరకే చేపట్టింది. తమ ఉద్యోగులు, ఇతర సిబ్బందిని ఐడీ కార్డులతో సంబంధం లేకుండా ఫేషియల్ రికగ్నిషన్ బయోమెట్రిక్ ద్వారా విమానాశ్రయంలోకి అనుమతించారు. ఇది విజయవంతమైంది. దీనితో పూర్తిస్థాయిలో దీన్ని ప్రయాణికుల కోసం అమలు చేయబోతున్నారు.