పివొకెలో అభినందన్ ఇలా బతికి బయట పడ్డాడు… ‘డాన్’ కథనం

భాారత్ పైలట్ అభినందన్ పారాష్యూట్ సహాయంతో పాక్ అక్రమిత కాశ్మీర్ లో దిగిన తర్వాత అల్లరి మూకల చేతుల్లో నుంచి ప్రమాదానికి గురి కాకుండా పాకిస్తాన్ సైన్యం కస్టడీలోకి ఎలా వచ్చాడనే దానిమీద పాకిస్తాన్ పత్రిక ‘డాన్’ ఒక అసక్తికరమయిన ఎక్స్ క్లూజివ్ కథనాన్ని ప్రచురించింది.

ఇది ఫుల్ రిపోర్టు

ముజఫరాబాద్ : బుధవారం సమయం ఉదయం 8.45 ని. ఆజాద్ కాశ్మీర్ (పాక్ ఆక్రమిత కాశ్మీర్)భింబర్ జిల్లా హొర్రా గ్రామంలో ఇంటి లోగిట్లో మహమ్మద్ రజాక్ చౌద్రి (58) కూర్చొని ఉన్నాడు.ఈ వూరు ఎల్ వొసి ఏడుకిలో మీటర్లు దూరాన ఉంటుంది. అంతలోనే ఆకాశంలో పొగ కమ్ముకుంది. పెద్ద పేలుడువినిపించింది.

మళ్లీ  మిలిటీరీ వాళ్ల గొడవేదో నడుస్తూ ఉందని ఆయన అనుమానం వచ్చింది. ఆకాశం వైపు మోర ఎత్తి చూశాడు. ఆకాశంలో రెండు విమానాలు కాలుతూ కిందపడుతున్నాయ్.  ఒకటేమో ఎల్ వొసి దాటి అటువైపు వెళ్లి పోయింది. రెండోది భగభగమండుతూ అదే వూర్లో పడింది. రజాక్ బయటకొచ్చాడు. ఇంటికి తూర్పున ఒక కిలో మీటర్ దూరంలో ఒక  నిర్జన ప్రదేశంలో మండుతున్న విమాన శకలాలుపడ్డాయి. రజాక్ ఆ  ప్రాంతంలో ఒక సంఘ సేవకుడు. తర్వాత ఒక పారాష్యూట్ కిందకు దిగడం  ఆయనకు కనిపించింది. శకలాలు తూర్పు వైపున పడితే, పారాష్యూట్ దక్షిణాన దిగింది.

పారాష్యూట్ నుంచి ఒక పైలట్ బయటకొచ్చాడు, అతగాడు సురక్షితంగా, దిట్టంగా ఉన్నాడని ఆయన డాన్ కు ఫోన్ లో వివరించాడు.

ఈ లోపు ఆయన వూర్లో ఉండే చాలా మంది కుర్రవాళ్లకు ఫోన్ చేశాడు. సైనిక సిబ్బంది వచ్చే దాకా ఆ శకలాల జోలికి ఎవ్వరు వెళ్లకుండా చూడండర్రా అని వాళ్లని పురమాయించాడు. అయితే, పైలట్ ను పట్టకొండని చెప్పాడు. వాళ్లంతా అభినందన్ వైపు దూసుకు వచ్చారు.


అప్పటికే పైలట్ పిస్టోల్ చేతిలోకి తీసుకున్నాడు. తన దగ్గరకు వచ్చిన  కుర్రవాళ్లని ఇది పాకిస్తానా, ఇండియానా అని అడిగాడు గట్టిగా అరచినట్లు. అయితే, గుంపులోనుంచి ఒకడు తెలివిగా ఇది ఇండియా అని సమాధాన మిచ్చాడు. దీనితో ‘నేను వింగ్ కమాండర్ అభినందన్’ అని పైలట్ పరిచయం చేసుకున్నాడు. కొన్ని నినాదాలు చేశాడు. ఇండియాలో కరెక్టుగా ఈ వూరేదని అడిగాడు.

దీనికి అదే కుర్రకుంక సమాధానమిస్తూ ఖిల్లాన్ (Quilla’n) అన్నాడు. ఆ పైన తన నడుం విరిగిందని చెబుతూ కొద్దిగా మంచినీళ్లు కావాలని పైలట్ అడిగాడు.

గుంపులో ఉన్న కొంతమంది ఆవేశపరులేన యువకులు అభినందన్ స్లోగన్ లను  జీర్ణించుకోలేకపోయారు. వాళ్ళు కూడా పాకిస్తాన్ ఆర్మీ జిందాబాద్ అని నినాదమీయడం మొదలుపెట్టారు. చాలా మంది రాళ్లు చేత్తో పట్టుకుని ఉండటం చూసి ప్రమాదముందని శంకించి అభినందన్ గాల్లోకి ఒక సారి కాల్చాడు.

రజాక్ చెప్పిందాని ప్రకారం, అభినందన్ తనను వెంబడిస్తున్న వాళ్ల చేతిలో పడకుండా పిస్టల్ చూపుతూ వెనక్కెనక్కి దాదాపు అర కిలోమీటర్ పరిగెత్తాడు. అలా వడివడిగా పరిగెడుతున్నపుడు, పిల్లకాయల్ని బెదరగొట్టేందుకు గాల్లోకి మరికొన్ని సార్లు కూడా కాల్పులు జరిపాడు. తర్వాత అక్కడున్న ఒక కుంటలోకి దూకాడు. దూకాక, తన జేబులో ఉన్న కొన్ని డాక్యుమెంట్లను, మ్యాప్ లను నీళ్లలో పడేశాడు, కొన్ని నమిలి మింగాడు. అక్కడున్న వాళ్లంతా తుపాకి పడేయమని అభినందన్ ని అరుస్తూనే ఉన్నారు. ఇంతలో ఒకడు అభినందన్ కాలి మీద కాల్చాడని రజాక్ చెప్పాడు.

తర్వాత కుంటలోనుంచి అభినందన్ బయటకు వచ్చాడు. తనను చంపవద్దని కోరాడు. పిల్లలు ఆయన్ని పట్టి బంధించారు. కోపంతో రెచ్చిపోయిన కొందరయితే ఆయన్ని కొట్టారు కూడా. మిగతా వాళ్లు వారిని వారించడం కనిపించిందని రజాక్ చెప్పాడు

ఈ లోపు సైనికులు అక్కడి వచ్చారు. కోపోద్రిక్తులయి ఉన్న యువకుల చేతిలో బందీగా ఉన్న అభినందన్ తమ కస్టడీలోకి తీసుకున్నారని రజాక్ ‘ది డాన్ ’ కు చెప్పారు.

‘భగవంతుడా, అభినందన్ వాళ్లనెంత సతాయించినా, ఆ కుర్రనాయాళ్లెవరూ ఈ పైలట్ ని కాల్చి చంపలేదు,’ అని రజాక్ చెప్పాడు.

ఆపైన సైనికులు అభినందన్ ని భింబెర్ లోని సైనిక స్థావరానికి సైనిక వాహనాల కాన్వాయ్ లో తీసుకెళ్లారు.

(ఫోటో కర్టసీ డాన్)